మిస్టర్... యూనివర్శిటీ టాపర్!
ఆ కుర్రాడు చాలా చురుకైనవాడు. యూనివర్శిటీ టాపర్. ఆటల్లోనూ బెస్ట్. లవ్‌లో పడితే ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడడు. మొత్తం మీద కుర్రాడు కత్తి. ఈ కత్తిలాంటి కుర్రాడి పాత్రలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘మిస్టర్’ గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలు.
ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ - ‘‘చాలా రోజుల తర్వాత లవ్‌స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాను. ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంది. ఇప్పటివరకూ వరుణ్ చేసిన చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది.
స్పెయిన్, బ్రెజిల్ షెడ్యూల్స్ తర్వాత అత్యధిక శాతం షూటింగ్‌ను కర్నాటక సరిహద్దుల్లో జరుపుతాం’’ అని చెప్పారు. మంచి టీమ్‌తో చేస్తున్న చిత్రం ఇదని వరుణ్ తేజ్ చెప్పారు. శ్రీను వైట్లతో తనకిది పదో సినిమా అనీ, వరుణ్‌తో చేస్తున్న ఫస్ట్ సినిమా అనీ, ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనీ కథారచయిత గోపీమోహన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, రచనా సహకారం: మధు శ్రీనివాస్-వంశీ రాజేశ్, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: జె. యువరాజ్, ఎడిటింగ్: ఎమ్.ఆర్. వర్మ, స్టైలింగ్: రూపా వైట్ల.