నడిగర్‌సంఘ నిధి కోసం మల్టీ స్టారర్ చిత్రం
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) భవన నిర్మాణం కోసం ఈ సంఘం కార్యదర్శి విశాల్,కోశాధికారి కార్తీ కలిసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం.ఆ మధ్య జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధానాలను గెలిచి సంఘ బాధ్యతలను చేపట్టిన కార్యవర్గం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. నాజర్, విశాల్,కార్తీల వర్గం చేసిన వాగ్ధానాల్లో ప్రధానమైనది సంఘ భవన నిర్మాణం. స్థానిక టీ.నగర్,అబిబుల్లా రోడ్డులో సంఘానికి చెందిన 19 గ్రౌండ్ల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాలని తీర్మానం చేశారు. దాన్ని ఇప్పుడు నెరవేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ భవనంలో వెయ్యి మంది కూర్చునే విధంగా ఒక ప్రాంగణం, కల్యాణ మండపం, ప్రివ్యూ థియేటర్, ఇక సమావేశ వేదిక, వ్యాయామ గది,నృత్య శిక్షణ హాలు,సంఘ కార్యాలయం వంటివి నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
వీటి నిర్మాణానికి సుమారు రూ.29 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇటీవల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టార్స్ క్రికెట్ క్రీడా కార్యక్రమం ద్వారా రూ.9 కోట్ల నిధిని రాబట్టారు. మిగిలిన నిధి కోసం రెండు చిత్రాలను నిర్మించనున్నారు. ఇందు కోసం ముగ్గురు దర్శకుల నుంచి కథలు విన్నారట. అందులో ఒక కథ సంఘ నిర్వాహకులకు బాగా నచ్చిందని సమాచారం. ఆ కథలో విశాల్, కార్తీ నటించనున్నారని తెలిసింది. వారి పారితోషికాలు సంఘం నిధికే చేరతాయట. ఈ చిత్రాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ చిత్రం ద్వారా సుమారు రూ.25 కోట్ల రూపాయలు సంఘం నిధికి వస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మరో చిత్రం కూడా నిర్మించనున్నారట. అందులో ఆర్య, జయంరవి హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. సంఘం భవన నిర్మాణాన్ని ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తునట్లు, ఈ నెల 10వ తేదీన జరుగనున్న కార్యవర్గ సమావేశంలో పైన చెప్పిన అంశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.