పద్నాలుగేళ్లకే ఉగ్రవాదులపై ఫైటింగ్కు..
ముంబయి: పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు పద్నాలుగేళ్లకే పోరాటానికి పూనుకున్నాడు. భారత సరిహద్దుకు వెళ్లి ఉగ్రవాదులతో పోరాడుతానని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు చరిత్ర పుస్తకాలను అమితంగా ఇష్టపడే ఆ అబ్బాయి తాను కశ్మీర్ లో భారత్ సేనలకు సహాయంగా వెళతానని, శత్రువులైన ఉగ్రవాదులను ఏరిపారేస్తానని చెబుతూ ఆ ప్రకారమే ఇళ్లు విడిచి వెళ్లాడు. అయితే, అలా బయల్దేరిన అతడ్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకొని తిరిగి ఇంటికి చేర్చారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వసాయిలో నిర్మల్ వాగ్(14) అనే విద్యార్థి ఉన్నాడు. అతడు వసాయ్ లోని ఎంజీ పరులేకర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అతడి తల్లి చనిపోయింది. తోటి విద్యార్థులు బాగా విమర్శిస్తూ ఏడిపిస్తున్నారని సమాచారం. అయితే, తెలివైన విద్యార్థి అయిన నిర్మల్ తాను చదివే చరిత్ర పుస్తకాల నుంచి స్ఫూర్తిని పొంది సరిహద్దులో జవాన్లకు సేవ చేయాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పకుండా ఆగస్టు 10న రాత్రి 10గంటల ప్రాంతంలో అమృత్ సర్ వెళ్లేందుకు గోల్డెన్ మెయిల్ రైలు ఎక్కాడు.
అయితే, టికెట్ లేకుండా అతడు రైలు ఎక్కడంతో టికెట్ కలెక్టర్ గుజరాత్ లోని సూరత్ లో అర్థరాత్రి 1.15గంటల ప్రాంతంలో దింపేశాడు. అయితే, అదే వసాయ్ కి చెందిన ప్రభు ఆలి అనే మరో వ్యక్తిని, నిర్మల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సంరక్షించారు. నిర్మల్ వద్ద రూ.2,500 డబ్బు ఉంది. కానీ, మొబైల్ ఫోన్ మాత్రం లేదు. నిర్మల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేయడంతోపాటు స్కూల్ యాజమాన్యం, స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో అతడి ఆచూకీకోసం విపరీతంగా ప్రయత్నించగా చివరకు అతడు ఆగస్టు 15నాటికి కుటుంబానికి చేరువయ్యాడు.