‘చచ్చినా’ వదలడం లేదు.. | Aadhaar Is Mandatory For Cremation In Varanasi | Sakshi
Sakshi News home page

‘చచ్చినా’ వదలడం లేదు..

Published Wed, May 30 2018 6:15 PM | Last Updated on Wed, May 30 2018 6:16 PM

Aadhaar Is Mandatory For Cremation In Varanasi - Sakshi

వారణాసి, ఉత్తరప్రదేశ్‌ : ‘వ్యక్తిగత గోప్యత - ఆధార్‌ అనుసంధానం’ మీద ప్రజలకున్న అనుమానాలు తీరకముందే మరో కొత్త ప్రతిపాదన తెర మీదకొచ్చింది. బతికున్న వారికే కాదు ఇక మీదట మరణించిన వారికి కూడా ఆధార్‌ తప్పనిసరి అంటోంది వారణాసిలోని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌).గంగానది తీరంలో ఉన్న మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌లలో అంత్యక్రియలు నిర్వహించాలంటే బంధువులు మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డును తప్పనిసరిగా చూపించాలంటున్నారు. ఈ ఘాట్లలో మృతదేహంతో పాటు, దానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే బంధువులను తీసుకెళ్లడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ వారు ‘కార్పస్‌ క్యారియర్‌ మోటార్‌ బోటు’ సౌకర్యం కల్పిస్తుంటారు.

ఇక మీదట మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డు చూపిస్తేనే వారికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఘాట్‌ నిర్వహకులు తెలిపారు. ఈ నియమాన్ని తీసుకురావడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు ఘాట్‌ నిర్వహకులు. కొంతకాలంగా ‘సుధాన్షు మెహతా’ ఫౌండేషన్‌కు చెందిన వ్యక్తులు మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. దానిలో భాగంగా 2015లో మొత్తం 4 కార్పస్‌ ‘మోటర్‌ క్యారియర్‌ బోట్ల’ను ఏర్పాటు చేశారు. కానీ గత కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వారిని తీసుకువచ్చి రహస్యంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలుపుతున్నారు సంస్థ సభ్యులు.

ఇప్పటికే ఆధార్‌ భద్రత గురించి వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హిందూవుల విశ్వాసం ప్రకారం మరణించిన వారికి కాశీలో అంత్యక్రియలు చేస్తే పుణ్యం అనే నమ్మకంతో చాలా మంది తమ ఆత్మీయుల చివరి కార్యక్రమాలను కాశీలో నిర్వహించడానికి వస్తుంటారు. కానీ ఇప్పుడు తీసుకువచ్చిన ఈ నూతన నియమం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారనుండటంతో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement