![‘ఒక ఐపీ– రెండు ఆస్పత్రులు’ పథకం ప్రారంభం](/styles/webp/s3/article_images/2017/09/5/41493667494_625x300.jpg.webp?itok=eLQi2Rc5)
‘ఒక ఐపీ– రెండు ఆస్పత్రులు’ పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: వలస కార్మికుల కోసం ‘ఒక ఐపీ(బీమా ఉన్న వ్యక్తి)– రెండు ఆస్పత్రులు’ పథకాన్ని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయసోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. బీమా తీసుకున్న వ్యక్తికి ప్రస్తుతం తన కోసం, తన కుటుంబం కోసం ఒక ఆస్పత్రినే ఎంచుకునే వీలుండగా ఈ పథకం కింద తన కోసం ఒక ఆస్పత్రిని, కుటుంబం కోసం మరొక ఆస్పత్రిని ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.
బీమా ఉన్న వారందరికీ వర్తించే ఈ పథకం వల్ల సొంత రాష్ట్రాల్లో కుటుంబాలను ఉంచి, వేరే రాష్ట్రాల్లో పనిచేసే కార్మికులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. కార్మిక రాజ్య బీమా సంస్థ చేపట్టిన రెండో తరం సంస్కరణలను వివరించారు. ఈఎస్‌ఐ పథకం కవరేజీ వేతన పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 21వేలకు పెంచామన్నారు. కార్యక్రమంలో ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ చెల్లింపుల పథకాన్ని ప్రారంభించి, వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురణల్ని ఆవిష్కరించారు.