సౌరశక్తి నగరంగా బెంగళూరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉద్యాన నగరి బెంగళూరును సౌర శక్తి నగరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో విద్యుత్ శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు మూడు రోజుల పాటు జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు. ఇళ్లపై సౌర ఘటకాలను అమర్చుకోవడం ద్వారా సౌర విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో పథకాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రైతులు కూడా తమ పొలాల్లో సౌర ఘటకాలను అమర్చుకోవడం ద్వారా విద్యుదుత్పాదన చేపడితే సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ఈ విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఐదెకరాల భూమి, రూ.ఏడు కోట్ల పెట్టుబడి ఉండి ఒక మెగావాట్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. బెంగళూరులో విద్యుత్ సమస్యను నివారించడానికి రూ.2,027 కోట్ల వ్యయంతో పథకాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రాష్ర్టంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని చెప్పారు.
వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ
అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, కొత్త కనెక్షన్లకు విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం కొత్త సర్క్యులర్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు. 2012 జులై 31కి ముందున్న అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే రూ.10 వేలతో పాటు డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలా చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి వసూలు చేస్తామని చెప్పారు. 2012 జులై 31 తర్వాత కనెక్షన్లను కోల్పోయిన వారు కూడా ఇంతే మొత్తం, డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేయడానికి మీటర్లను అమర్చుతామని ఆయన తెలిపారు.