రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పరాజయం పాలు కావడానికి రైతుల ఆగ్రహమే కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా వ్యవసాయ సంక్షోభం కొనసాగుతుండటం, రైతుల కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఫలించకపోవడంతో రైతులు పాలక పక్షాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంతో తమ కోపాన్ని ప్రదర్శించారని వారంటున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిస్థితి ఎదురు కాకుండా చూసేందుకు ఇప్పటి నుంచే రైతుల కోసం పథకాలు ప్రకటించాలని బీజేపీ ఆలోచిస్తోంది. గత ఏడాది కేంద్రం పంటల కనీస మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచింది. అయినా కూడా ఎన్నికల్లో అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇక మిగిలింది. రైతులకు అత్యధిక ప్రయోజనం కలిగించేది రుణమాఫీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రైతు రుణ మాఫీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. యూపీఏ సర్కారు కూడా 2008లో 72వేల కోట్ల రూపాయల మేర రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. 2009 ఎన్నికల్లో కేంద్రంలో మెజారిటీ సాధించి అధికారంలోకి రావడానికి అదీ ఒక కారణమే.
ఆర్థికంగా పెనుభారం
రుణమాఫీ రాజకీయంగా మేలు చేసినా దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల పాలవుతుందని, బ్యాంకులపై పెనుభారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కేంద్రానికున్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా రుణమాఫీని దేశమంతటికీ కాకుండా దుర్భిక్ష ప్రాంతాలకు మాత్రమే ప్రకటిస్తే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. అదీకాక, ఈ రుణమాఫీ వల్ల పెద్ద రైతులే లాభపడతారని, 80శాతానికి పైగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదని కూడా వారు వివరిస్తున్నారు.ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉండటం, ఎగుమతి నిబంధనలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి సర్కారు ప్రయత్నిస్తే బాగుంటుందని కేర్ రేటింగ్స్ సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ సూచించారు. ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను పెంచడం వంటి వాటిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు.2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3శాతానికి పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ రుణమాఫీ అమలయితే ద్రవ్యలోటు అంచనాలను మించిపోతుందని ఆయన చెప్పారు.
మాఫీ@లక్షల కోట్లు
ప్రస్తుత ఎన్‌డీఏ సర్కారు కూడా రైతు రుణమాఫీ ప్రకటించాలని భాగస్వామ్య పక్షాలు బీజేపీపై ఒత్తిడి తెస్తున్నాయని, అయితే, 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల ముందు ప్రకటించే ఉద్దేశంతో.. బీజేపీ ఇప్పుడా పథకాన్ని కావాలనే పక్కన పెట్టిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజా ఫలితాల నేపథ్యంలో వీలయినంత త్వరలో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్దమవుతోందని ఆ వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 26 కోట్ల 30లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయడం మాటలు కాదు. దీనికి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు కావాలి.ఇది కేంద్రానికి పెను ఆర్థిక భారంగా పరిణమిస్తుంది. అయినా సరే ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధపడుతోందని ప్రభుత్వ వర్గా లు అంటున్నాయి. రుణ మాఫీతో పాటు కనీస మద్దతు ధర పెంపు, పంటల సేకరణ పరిమాణం పెంపు వంటి చర్యలు కూడా తీసుకుని రైతాంగం ఆగ్రహాన్ని ఉపశమింపచేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ‘ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. ఇంత వరకు ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించలేకపోయింది. దాని ఫలితం మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించింది. కాబట్టి వీలయినంత తొందరగా రైతు రుణ మాఫీని ప్రభుత్వం ప్రకటించకతప్పదు’ అన్నారు ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ గులాటి. ఏ ప్రభుత్వమైనా రైతులకు చేసే అతిపెద్ద మేలు రుణ మాఫీయేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment