సామాన్యుడిని పట్టించుకోరా?
అధికారులపై హైకోర్టు ఆగ్రహం పునరాభివృద్ధి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకతవిచారణ వాయిదా
న్యూఢిల్లీ: సామాన్యుడి ఇబ్బందులు, ఆరోగ్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోకుండా వాణిజ్య ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్టు అనుమతులు ఇవ్వడం సరికాదని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. ‘మనమంతా ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాం. బడాబాబులు మాత్రం భారీ భవనాలు కట్టుకుంటున్నారు. సామాన్యుడి బాధల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు ప్రాజెక్టుల అనుమతులే ముఖ్యం.
ప్రజలు ఏమైనా ఫర్వాలేదు’ అని న్యాయమూర్తి మన్మో హన్ వ్యాఖ్యానించారు. కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ 2 వంటి ప్రాంతాల పునరాభివృద్ధి ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెం బర్ 29కి వాయిదా వేశారు. ఈ ప్రాజెక్టులు అమలైతే ఈ రెండు ప్రాంతాల్లో పేదరికం పెరుగుతుందని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది.
పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి వివరిస్తూ సంబంధిత అధికారులు విడుదల చేసిన బ్రోచర్లు చూస్తుంటే ఈ ప్రాంతం ఒక పట్టణ మురికివాడలా మారగలదని అనిపిస్తోందని న్యాయమూర్తి మన్మోహన్ పేర్కొన్నారు. నగరాల్లో మురికివాడలను పెంచే ఇలాంటి ప్రాజెక్టులను అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు. కిద్వాయ్‌నగర్ ప్రాజెక్టు ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ప్రస్తుతమున్న రోడ్లు, నీరు, విద్యుత్ ఈ ప్రాజెక్టుకు సరిపోతాయో లేదో ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఆదేశాలు జారీ చేయకపోయినా, ఎల్జీ వివరణ అందిన తరువాత స్పందిస్తామని పేర్కొన్నారు.
ప్రాజెక్టు ప్రణాళికలను మంజూరు చేసింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) కాబట్టి ఈ కేసులో దానిని కూడా వాదిగా చేర్చాలని హైకోర్టు సూచించింది. సౌత్ ఎక్స్‌టెన్షన్, దాని పరిసర ప్రాంతాల సహజత్వం దెబ్బతినే చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి పైవ్యాఖ్యలు చేశారు.
కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ 2 పునరాభివృద్ధి ప్రాజెక్టు అమలు ప్రమాణాల ప్రకారం జరగడం లేదని, అందుకే దానిని రద్దు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల పెరిగే వాహన సంచారానికి సరిపడా రహదారులు లేవనే విషయాన్ని పోలీసుశాఖ ఇది వరకే తెలిపిందని న్యాయవాది అమన్ లేఖీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వ్యాపారీకరణకు భారీగా స్థలం కేటాయించడం వల్ల గృహవసతి సదుపాయాలు తగ్గి మురికివాడలు ఏర్పడతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.