విద్యార్థులతో టీచర్ మసాజ్...
రాయపూర్ః విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం విస్మయం కలిగించింది. ఛత్తీస్ గఢ్ జాష్ పూర్ జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థులతో బాడీ మసాజ్ చేయించుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించింది. స్థానిక తుమ్లా హై స్కూల్ లో పనిచేస్తున్న అనుప్ మింజ్.. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులను మసాజ్ చేయమనడం వీడియోలో వినియోగదారులను విస్మయపరుస్తోంది.
తుమ్లా హైస్కూల్లో ఇంగ్లీష్ బోధించే మింజ్ తీరుపై చిత్రించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. వీడియో చూసిన తల్లిదండ్రులు మాస్టారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి, వారిలో జ్ఞానాన్ని పెంచాల్సిన ఉపాధ్యాయుడే.. వారు చదువుకునే సమయాన్ని చాకిరీ చేయించుకోడానికి వినియోగించడంపై మండి పడుతున్నారు. అంతేకాదు విషయంపై జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. వీడియోను ప్రత్యక్షంగా చూసిన అధికారులు సైతం మాస్టారి తీరును చూసి విస్తు పోయారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం తాను జ్వరం, ఒళ్ళునొప్పులతో బాధపడటం చూడలేక.. విద్యార్థులే స్వయంగా తనకు మసాజ్ చేశారని, తనంతట తాను విద్యార్థులను మసాజ్ చేయమని కోరలేదని చెప్తున్నాడు.