ఆమెను 500 రూపాయలకు అమ్మేశారు.... | child sold for just for 500 rupees | Sakshi
Sakshi News home page

500 రూపాయలకు అమ్మేశారు....

Published Sat, Nov 4 2017 3:41 PM | Last Updated on Sat, Nov 4 2017 3:42 PM

child sold for just for 500 rupees - Sakshi

సాక్షి, ఇటానగర్‌ : ఆమె, ఆమె మోకాళ్ల ఎత్తువరకు ఉన్నప్పుడు తండ్రి చేతులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. పచ్చని తేయాకు తోటల మధ్య నుంచి చెంగు చెంగున ఎగురుకుంటూ బయల్దేరింది. ఓ తేయాకు తోట ముందు తండ్రితోపాటు బస్కెక్కింది. ఆ బస్సు ఆమెను ఆమె తండ్రిని ఎక్కడికో తీసుకెళ్లి దింపేసింది. మళ్లీ తండ్రివెంట అలా నడుచుకుంటూ కొంతదూరం వెళ్లింది. అక్కడ ఓ అందమైన ఇంటి ముందు తండ్రితో పాటు నిలబడింది. ఆ ఇంట్లో నుంచి ఎవరో బయటకు వచ్చారు. తండ్రికి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చారు. పిల్లను అక్కడే వదిలేసి తండ్రి వెనుతిరిగి పోయాడు. ఆ ఇంట్లోని వారు ఆ పిల్లను ఇంట్లోకి తీసుకెళ్లారు. తండ్రి కోసం ఎంతో ఏడ్చింది. తండ్రి తిరిగి రాలేదు. అప్పుడే కాదు. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ పిల్ల పేరు బడాయిక్‌. అంతకుమించి అప్పటికి ఆమెకు ఏమీ తెలియదు.

ఆ ఇంట్లోని వారు ఆ చిట్టి చేతులతోని అల్లం వెల్లుల్లి గ్రైండ్‌ చేయించారు. ఇల్లు ఊడిపించారు. కొన్ని రోజుల తర్వాత గిన్నెలు తోమించారు. ఆ తర్వాత బట్టలు , ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో వంట చేయడం కూడా నేర్చుకుంది. ఇలా ఎనిమిదేళ్లు వచ్చేసరికి బడాయిక్‌ అన్ని పనులు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో రోజుకు 17 గంటలపాటు చాకిరి చేయడం ప్రారంభించింది. పదేళ్లు వచ్చేసరికి ఆ కుటుంబంతో తనకేమీ సంబంధం లేదని, ఆ ఇంట్లో తాను పని మనిషినని తెలిసివచ్చింది. తన జీతం నెలకు వందరూపాయలని తెలుసుకుంది. జీతాన్ని నెలనెల తన పేరిట బ్యాంకులో జమ చేస్తారని తెల్సింది. అది కూడా తనకివ్వరని, ఒంట్లో బాగోలేనప్పుడు ఆ డబ్బులతోనే మందులు ఇప్పిస్తారని తెల్సింది. ఎక్కడో చదువుకుంటున్న ఆ ఇంటి యజమాని కూతురు సెలవులకు ఇంటికొచ్చినప్పుడు సరదాగా గడిపేందుకు సెలవులు కూడా ఉంటాయని తెల్సింది.

తనకు 12 ఏళ్లు వచ్చే సరికి తాను బానిసగా బతుకుతున్నానని తెల్సింది. అప్పటి నుంచి తోటి వారికోసం వెతకడం ప్రారంభించింది. ఆమెకు 16వ ఏట, అంటే 2016లో తనలాంటి పని మనిషి తగిలింది. ఆమె సహాయంతో మొబైల్‌ ఫోన్‌ సంపాదించి లీలమాత్రంగా గుర్తున్న తన అంకుల్‌కు ఫోన్‌ చేయడం ప్రారంభించింది. ఎన్నో రాంగ్‌ నెంబర్ల అనంతరం ఓ రోజున అంకుల్‌కు ఫోన్‌ కలిసింది. తన గురించి తెలియజేయడంతోపాటు తన ఊరు, రాష్ట్రం గురించి తెలుసుకుంది. తానుంటున్న రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ అని ఇదివరకే తెలుసుకున్న బడాయిక్‌కు తన స్వగ్రామం అస్సాంలోని బిశ్వనాథ్‌ జిల్లా పూరుబరి విలేజ్‌ అని తెల్సింది.

అంకుల్‌ చెప్పిన వివరాలు, తోటి పనిమనిషి సహకారంతో అక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్వగ్రామం చేరుకుంది. కలలో చూసినట్లుగా కనిపిస్తున్న ఆ గ్రామంలో తాముంటున్న ఇంటిని గుర్తుపట్టలేకపోయింది. అంకుల్‌ సాయంతో ఇల్లు చేరింది. ఇంటి ముందు తన కోసం ఎదురు చూస్తున్న తనను అక్కున చేర్చుకొని తనివితీర ఏడ్చింది. వరండాలో ఓ మూలన బిత్తరపోయి చూస్తున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి చెంప మీద లాగి కొట్టింది. తన తండ్రి తన తర్వాత తన చెల్లి కూడా తనలాగే అమ్మేశాడని బడాయిక్‌ తెలుసుకుంది.

పిల్లల అక్రమ రావాణాను అరికట్టేందుకు, పిల్లల హక్కుల కోసం స్థానికంగా పోరాడుతున్న స్వచ్ఛంద జాగతి సమితీ, థామ్సన్‌ రాయ్‌టర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులను బడాయిక్‌ కలుసుకొని తన కథను వివరించింది. తనను ఎప్పుడు అమ్మేశారో తెలియదని, తనకిప్పుడు మాత్రం 16, 17 ఏళ్లు ఉండవచ్చని తెలిపింది. అమ్మేసిన తన చెల్లెలిని కూడా వెతికి పెట్టాల్సిందిగా ఆమె స్వచ్ఛంద సంస్థలను కోరింది. బడాయిక్‌ లాంటి వారు తప్పించుకొని ఇంటికి రావడం వల్ల ఆమె అనుభవించిన జీవితం గురించి తెల్సింది. వెనక్కి రాని వారి గురించి ఎప్పటికీ తెలియదు. అమ్మివేయడం లేదా ఎత్తుకెళ్లడం వల్ల గల్లంతైన పిల్లల్లో సగం మంది వ్యవసాయ పనుల్లో, నలుగురిలో ఒకరు ఉత్పాదన రంగంలో, మిగతా వారంతా ఇళ్లలో, హోటళ్లలో అరవ చాకిరి చేస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తం 16.80 కోట్ల మంది పిల్లలు, భారత్‌లో 40 లక్షల మంది పిల్లలు ఇలా వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపుపోందిన అస్సాం తేయాకు పరిశ్రమ గత కొన్నేళ్లుగా తీవ్రంగా దెబ్బతినడం, కార్మికులు ఉపాధి కోల్పోవడం, పేదరికం పెరిగిపోవడం వల్ల ఇక్కడ పిల్లల అమ్మకాలు పెరిగాయి. కొన్ని సందర్భాల్లో ఆరుబయట ఆడుకుంటున్న పిల్లలను ఇరుగు, పొరుగువారు కూడా ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement