యూపీలోని సర్దార్ బజాజ్‌లో స్ప్రే చేస్తున్న వాలంటీర్లు
లక్నో: మహమ్మారి కరోనాపై పోరులో భాగమైన ఓ వార్డుబాయ్ తన చిన్నారి అంత్యక్రియలు నిర్వహించలేకపోయాడు. మూడేళ్ల కొడుకు చావుతో పోరాడి కనుమూసినా అతడిని గుండెలకు హత్తుకుని ఏడ్చే వీల్లేక మానసిక వేదన అనుభవించాడు. దూరంగానే నిలబడి కొడుకుకు కన్నీటి వీడ్కోలు పలికాడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... లక్నోకు చెందిన మనీశ్ కుమార్(27) అనే వ్యక్తి లోక్‌బంధు ఆస్పత్రిలో వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఐసోలేషన్ వార్డులో సేవలు అందిస్తున్న క్రమంలో శనివారం రాత్రి అతడికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. కొడుకు హర్షిత్‌కు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని, కడుపునొప్పితో విలవిల్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు అతడికి చెప్పారు. ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలతో పోరాడుతూ కన్నుమూశాడని వాట్సాప్‌లో తెలియజేశారు. దీంతో మనీశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.(కరోనా రోగులకు సేవ: సిక్కు సోదరుల కఠిన నిర్ణయం)
ఈ విషయం గురించి మనీశ్ మాట్లాడుతూ.. ‘‘ ఆరోజు రాత్రి ఆస్పత్రిలోనే ఉన్నాను. అప్పటికే బాగా నీరసించిపోయాను. ఇంతలోనే ఇంటి నుంచి కాల్ చేశారు. నా కొడుకును కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు వాటి ఫొటోలను నాకు వాట్సాప్‌లో పంపుతూనే ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు వాడు మమ్మల్ని విడిచివెళ్లిపోయాడని చెప్పారు. నాకేం అర్థంకాలేదు. వాడిని చూడాలనిపించింది. కానీ ఈ విషయాన్ని నా సహోద్యోగులకు చెప్పలేదు. (కరతాళ ధ్వనులతో అంతిమ వీడ్కోలు)
పేషెంట్లను వదిలి వెళ్లడానికి మనసు ఒప్పుకోలేదు. అయితే నాకు వెనువెంటనే ఫోన్ కాల్స్ రావడం.. నా కళ్లల్లో నీళ్లు చూసి పరిస్థితి వాళ్లకు అర్థమైంది. నన్ను ఇంటికి వెళ్లమని చెప్పారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేజీఎంయూకు వెళ్లి నా కొడుకును చూశాను. వాడిలో కదలిక లేదు. నాతో ఆడుకోలేడు. దూరంగా చూసుకుంటూనే బైక్ మీద అంబులెన్సును ఫాలో అయ్యాను. ఇంటి బయటే ఉన్నాను. వాడిని ముట్టుకునేందుకు కూడా నాకు అవకాశం లభించలేదు. నా కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది రాకూడదని దూరంగా నిలబడ్డా.వాడి ఫొటోలు, వీడియోలు చూసుకుంటున్నా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉంటున్నానని.. అయితే భౌతిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని మనీశ్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే డ్యూటీలోనే జాయిన్ అవుతానని... పేషెంట్లకు సేవ చేయడం తన ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment