చండీగఢ్: సెక్యూరిటీ లేకుండా మార్నింగ్వాక్కు కూడా వెళ్లని జడ్జిగారు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఒక బాలికను కాపాడిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న పంజాబ్, హర్యానా హైకోర్ట్ జడ్జి జస్టిస్ జైపాల్ తన సెక్యూరిటీ ఆఫీసర్ యశ్పాల్తో కలిసి సుఖానా సరస్సు ఒడ్డున వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో హెల్ప్.. హెల్ప్.. అంటూ పెద్దగా అరుపులు వినిపించాయి. ఒక బాలిక సరస్సులో మునిగిపోవడాన్ని చూసిన జైపాల్ .. క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను రక్షించడానికి సరస్సులోకి డైవ్ చేశారు.
సాక్షాత్తు జడ్జిగారే దూకితే మరి రక్షణాధికారి ఊరుకుంటారా.... జడ్జిగారితో పాటే ఆయన కూడా సరస్సులోకి దూకేశారు. ఇద్దరూ మునిగిపోతున్నబాలిక కోసం వెదుకులాట మొదలుపెట్టారు. ఇంతలోనే భూమి అడుగుకు చేరిన బాలికను గమనించిన సెక్యూరిటీ అధికారి యశ్పాల్ హుటాహుటిన ఆమెను ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే ఆ బాలిక అపస్మారక స్థితిలోకి జారుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆబాలికను ఆసుపత్రికి తరలించారు.
చదువుల్లో మంచి మార్కులతో రాణిస్తున్నప్పటికీ, తండ్రి పేదరికం మూలంగా చదువుకు దూరమైంది సదరు బాలిక. దీంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. విషయం తెలుసుకున్నజడ్జ్ జైపాల్ ఆబాలిక చదువుకు సహాయం చేయడమే కాదు.. బాలికను రక్షించడంలో ముఖ్యభూమిక పోషించిన సెక్యూరిటీ అధికారికి నగదు పురస్కారం ప్రకటించి, పదోన్నతికి సిఫారసు చేశారట.