'ఆమ్లా' తో సారవంతమైన రాజస్థాన్ గ్రామాలు! | How One Woman Made 100 Villages in Rajasthan Fertile Using Traditional Water Harvesting Methods | Sakshi
Sakshi News home page

'ఆమ్లా' తో సారవంతమైన రాజస్థాన్ గ్రామాలు!

Published Fri, Dec 18 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

'ఆమ్లా' తో సారవంతమైన రాజస్థాన్ గ్రామాలు!

'ఆమ్లా' తో సారవంతమైన రాజస్థాన్ గ్రామాలు!

ఎడారిని తలపించే అక్కడి భూములు ఇప్పుడు సారవంతంగా మారిపోయాయి. వేసవిలో మండించే ఎండలు, తగినంత నీరు లేక సాధారణ జీవనమే గడపలేని రాజస్థాన్  ప్రాంతంలోని గ్రామాలు నీటి సమస్యకు దూరమయ్యాయి. నీరులేక బీడువారిన పొలాలు ఇప్పుడు సస్యశ్యామలమయ్యాయి. ఒక్క పంటకే దిక్కులు చూడాల్సిన పరిస్థితి మారి...రైతులు ఏడాదికి మూడు పంటలు కూడ పండిస్తున్నారు. పశువుల ద్వారా కుటుంబ సభ్యులు సంవత్సరంలో అదనపు ఆదాయాన్నీఆర్జిస్తున్నారు. ముంబైకి చెందిన మహిళ అద్భుత కృషి ఆ గ్రామాల ముఖచిత్రాన్నే మార్చేసింది. వాటర్ మదర్ గా పేరు తెచ్చుకుంది.

సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేసి, చెక్ డ్యామ్ లు నిర్మించి  రాజస్థాన్ లో వందకు పైగా గ్రామాల ముఖ చిత్రాన్నే మార్చేసింది ముంబైకి చెందిన మహిళ ఆమ్లా. స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఆమెకు అది సాధ్యమైంది.  2లక్షల మంది ప్రజలనుంచి ఏడాదికి మూడు వందల కోట్ల ఆదాయం తెచ్చుకునే స్థాయికి చేరింది.  1999/2000 ప్రాంతంలో రాజస్థాన్ కరువుతోనూ, రైతులు దయనీయమైన స్థితిలోనూ ఉన్నట్లు వార్తా పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న ఆమ్లా...  సమస్యకు పరిష్కారం దిశగా తీవ్రంగా ఆలోచించింది. ముందుగా వాటర్ ట్యాంకర్ల ద్వారా గ్రామస్థులకు నీటిని అందించాలనుకుంది. ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి రాజస్థాన్ లోని నీటి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించింది. వర్షపు నీటిని వాటర్ హార్వెస్టింగ్ పద్ధతి ద్వారా నిల్వ చేసి అందించడమే సరైన పద్ధతిగా భావించిన ఆమె... ఇందుకు స్థానికుల సహకారం తీసుకొని, విజయవంతంగా ముందుకు దూసుకుపోయింది.

ముందుగా చెక్ డ్యామ్ ల నిర్మాణంద్వారా పనులు ప్రారంభించి, మండవార్ గ్రామంలో తన మొదటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ట్రస్ట్ ద్వారా నిర్మించిన రెండు చెక్ డ్యాం లతో  ఒక్క సంవత్సరంలోనే మంచి ఫలితాలను పొందడంతో స్థానిక రైతులు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకూ ఆర్జించగలిగారు. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూడలేదు. ప్రస్తుతం ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా యాక్ట్ సంస్థ సారధ్యంలో సుమారు వంద గ్రామాల్లో  200 చెక్ డ్యాంలు నిర్మించారు. వీటి ఆధారంగా  రెండు లక్షలమంది ప్రజలు మూడు వందల కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు. ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చవగా... నలభై శాతం ఖర్చులను రైతులు భరించారు. ప్రతి విషయంలోనూ రైతులకు సహాయ సహకారాలను అందిందిస్తూ, ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు నిరంతర పర్యవేక్షణతో  మంచి ఫలితాలు సాధించగలిగామని ఆమ్లా చెప్తోంది. ఆమె అనుకున్నట్లుగా రాజస్థాన్ గ్రామాలను సస్యశ్యామలం చేయగల్గింది. ఇకపై మంచినీటికోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఇళ్ళవద్దకే మంచినీటి సౌకర్యం దిశగా అడుగులు వేస్తోంది.

పశు సంపదతో కూడా గ్రామాలు వర్థిల్లుతుండటంతో ఇప్పుడు స్థానికులు పట్టణాలకు వలసలు పోవడం తగ్గింది. ఒకప్పుడు ఈ గ్రామాల పురుషులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేసేందుకు వెనుకాడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమ్లా చెప్తోంది. ''ఈ విజయం నాకు అంత సులభంగా రాలేదు. నా ప్రయత్నంలో యాక్ట్ భాగస్వామ్యం కూడా అధికంగానే ఉంది. అనేకసార్లు ప్రభుత్వం మోకాలడ్డినా మా బృదం ఛాలెంజ్ గా తీసుకొని సమస్యలను అధిగమించాం.'' అంటోంది ఆమ్లా. భవిష్యత్లులో ఆమ్లా టీమ్ ఇతర రాష్ట్రాల్లోనూ తమ సేవలను అందించేందుకు సిద్ధమౌతోంది. మధ్యప్రదేశ్, మహరాష్ట్రల్లో ఇప్పటికే సమస్యలపై అధ్యయనం ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement