సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19ను ఎదుర్కొనే క్రమంలో అట్టడుగు వర్గాలకు ఆసరా కల్పించడంతో పాటు ఇతర చర్యల కోసం భారత్‌కు దాదాపు రూ 10,500 కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏడీబీ కోవిడ్-19 రెస్పాన్స్ కార్యక్రమం (కేర్స్) కింద మహమ్మారి ప్రభావిత పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకు సంసిద్ధత తెలిపిందని వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం కల్పించి భవిష్యత్‌లోనూ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు అవసరమైన సాయం కోసం ఏడీబీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కసరత్తు సాగుతోందని తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు పేదలు, మహిళలు, అణగారిన వర్గాలను కాపాడుకునేందుకు తక్షణ సాయం ప్రకటించిన క్రమంలో ఏడీబీ నుంచి సత్వర సాయం అందిందని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment