సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయని చూపడం కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు కొంత మంది సీనియర్ జర్నలిస్టులను విమానంలో తీసుకెళ్లి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గగన విహారం చేయించింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లు, దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. పాఠశాలలు, కాలేజీలకు తాళాలు ఉన్నాయి. రోడ్ల మీద జన సంచారం లేదు. సైనికుల బూట్ల చప్పుడు, అక్కడక్కడ వీధి కుక్కల విహారం తప్ప ఎలాంటి సందడి లేదు. సాధారణ పరిస్థితులంటే ఇంతటి ప్రశాంతమా?
అసలే బక్రీద్ పండగ రోజు. సాధారణ పరిస్థితులంటే ఎలా ఉండాలి ? సందడి సందడిగా, గోలగోలగా ఉండాలి. ఈద్ ముబారక్ అంటూ పెద్దలు కౌగిలింతలు, పిల్లల కేరింతల మధ్య వీధులు విస్తుపోవాలి. ఒకరినొకరు కలుసుకొని మంచి, చెడు కబుర్లు కలబోసుకోవాలి. అత్తరు వాసనల మధ్య పిల్లా, పాప, చిన్నా, పెద్ద మైమరచి పోవాలి. అలాంటిది ఈ భయంకరమైన నిశబ్దం ఏమిటీ? వారం రోజులుగా కశ్మీర్‌లో ఇదే పరిస్థితి. టెలిఫోన్, మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్నా పిల్లలతోని పెద్దలు, పెద్దలతోని పిల్లలు మాట్లాడేందుకు కనీసం ల్యాండ్‌లైన్ ఫోన్లు కూడా పని చేయడం లేదు. అసహన పరిస్థితులు కొనసాగుతున్న చైనాలోని హాంకాంగ్, మయన్మార్, సిరియా, ఇజ్రాయెల్ దేశాల్లో మినహా ప్రపంచంలో ఎక్కడా ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులను నిలిపివేసిన దాఖలాలు లేవు. ఈ నాలుగు దేశాల్లో కూడా ల్యాండ్ లైన్ల సర్వీసులపై కోత లేదు.
సాధారణ పరిస్థితలుంటే ఈ సర్వీసులన్నీ కొనసాగాలి. పౌరజీవనం ఇలా స్తంభించిపోకూడదు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రెండు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు హర్షిస్తున్నారని కేంద్రం చెబుతున్నప్పుడు ఈ అకాల ఆంక్షలేమిటి? బక్రీద్ పండుగ రోజున యోగక్షేమాలు కనుక్కునేందుకు కూడా ఫోన్లు పనిచేయలేదు.
ఈసారి పండగ సందర్భంగా కశ్మీర్‌కు వెళ్లలేని వారి కోసం ఢిల్లీ, గురుగావ్, ముంబై నగరాల్లో స్థానికులు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గుర్‌గావ్‌లో ఈద్ వేడుకలను కశ్మీర్ పిండిట్ కుటుంబాలు ఏర్పాటు చేయడం విశేషం. ఢిల్లీలో జంతరమంతర్ వద్ద కశ్మీర్ స్టూడెంట్స్ యూనియన్, కొంతమంది స్థానిక కశ్మీరీలతో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేశారు. తాము ఈద్ వేడుకలను జరపడం లేదని, ఈ సందర్భంగా కశ్మీరీలు ఒక్కచోట కలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, రామ్ మనోహర్ లోహియా వైద్య కళాశాల నుంచి ఇటీవలనే పట్టా పుచ్చుకున్న షరీక ఆమిన్ తెలిపారు. యూపీఎస్‌యూ పరీక్షల ప్రిపరేషన్ కోసం పది రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన జుబేర్ రషీద్ అనే యువకుడు వేదిక వద్ద తెలిసిన వారిని పట్టుకొని బోరున ఏడ్చారు. వారం రోజులుగా కుటుంబ సభ్యులతోని మాట్లాడలేకపోతున్నానని బాధపడ్డారు. ఆ వేదిక వద్ద కంట తడి పెట్టించే ఇలాంటి దృశ్యాలెన్నో కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment