ఆ రోగిని చంపెయ్.. జూనియర్‌కు డాక్టర్ సలహా | kill that patient, advises senior doctor to junior | Sakshi
Sakshi News home page

ఆ రోగిని చంపెయ్.. జూనియర్‌కు డాక్టర్ సలహా

Published Tue, Oct 11 2016 9:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:25 PM

ఆ రోగిని చంపెయ్.. జూనియర్‌కు డాక్టర్ సలహా - Sakshi

ఆ రోగిని చంపెయ్.. జూనియర్‌కు డాక్టర్ సలహా

వైద్యో నారాయణో హరిః అంటారు. ఎంతటి సీరియస్ పరిస్థితుల్లో ఉన్నాసరే పేషెంట్ల ప్రాణాలను ఎలాగోలా కాపాడాలని డాక్టర్లు శాయశక్తులా కృషిచేస్తారు. కానీ, అలాంటి పవిత్రమైన వైద్యవృత్తికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో డాక్టర్. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజిలో పనిచేసే సీనియర్ డాక్టర్.. తన జూనియర్‌తో రోగిని చంపేయమని చెప్పాడు. ఈ వ్యవహారం అంతా రికార్డు కూడా అయ్యింది. టీబీతో బాధపడుతూ, పొట్టలో అల్సర్ల కారణంగా తీవ్ర రక్తస్రావం అవుతున్న రోగికి చికిత్స చేయొద్దని చెప్పడమే కాక.. ''అతడిని చంపెయ్. అతడిని ఆస్పత్రిలో చేర్చుకో.. కానీ తనంతట తానే ఆస్పత్రి వదిలి వెళ్లిపోయేలా చెయ్యి'' అని జూనియర్‌కు చెప్పాడు. సీనియర్ సూచనలను జూనియర్ వైద్యుడు కూడా అక్షరాలా పాటించడంతో ముఖేష్ ప్రజాపతి (18) అనే ఆ పేషెంటు కాసేపటికే చనిపోయాడు. వైద్యుల సంభాషణ మొత్తాన్ని ముఖేష్ తండ్రి తీకమ్ ప్రజాపతి తన ఫోన్లో రికార్డు చేశారు. ఈ వ్యవహారం గురించి ఆయన ఆ తర్వాత మీడియాకు వివరించారు.

''రాత్రి 10 గంటల సమయంలో టీబీతో బాధపడుతున్న మా అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్లా. అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మెడిసిన్ వార్డులో మేం చెప్పే మాటలను డాక్టర్లు ఏమాత్రం వినిపించుకోలేదు. నోటీసు బోర్డు మీద సర్జరీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ శ్వేతాంక్ ప్రకాష్ ఫోన్ నెంబరు ఉండటంతో ముఖేష్ ఫోన్ నుంచి ఫోన్ చేశా. ఆయన జూనియర్ డాక్టర్‌తో మాట్లాడితే పని జరుగుతుందని భావించా. ఆ తర్వాత ముఖేష్‌ను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. కానీ కాసేపటికే  అతడు చనిపోయాడు'' అని తీకమ్ ప్రజాపతి వివరించారు.

ముఖేష్ ఫోన్‌లో మొత్తం కాల్స్ అన్నీ రికార్డయ్యే సదుపాయం ఉంది. అది ఆన్‌లో కూడా ఉంది. ఆ విషయం ఆ ఫోన్లో మాట్లాడుకున్న వైద్యులకు తెలియదు. ముఖేష్ చనిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ''అతడిని తప్పకుండా చేర్చుకో. సర్జరీలో లేదా మెడిసిన్ వార్డులో చేర్చుకో. అతడిని చంపెయ్యి.. రక్తం తెమ్మని చెప్పు.. వాళ్లంతట వాళ్లే పారిపోతారు'' అని డాక్టర్ శ్వేతాంక్ ప్రకాష్ చెప్పడం ఆ ఫోనులో రికార్డయింది. దాంతో.. ముఖేష్ కుటుంబ సభ్యులు ఎంఎం గేట్ పోలీసు స్టేషన్‌లో సీనియర్ డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. తప్పుడు మందులు ఇవ్వడం వల్లే ముఖేష్ చనిపోయాడని ఆరోపించారు.

అయితే, ఆడియో క్లిప్‌ను ఎడిట్ చేసి తాను అనని మాటలు కూడా చేర్చారని డాక్టర్ ప్రకాష్ ఆరోపించారు. తాను వెంటనే ఆ రోగికి తగిన చికిత్స చేయాల్సిందిగా జూనియర్‌కు సూచించానని, అతడు సర్జరీ పేషెంటు కాదు కాబట్టి జాగ్రత్తగా చికిత్స చేయాలని చెప్పానన్నారు. ఇదంతా తన పేరు చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement