రెనాల్డ్ పీటర్, నటి శ్రుతి
టీ.నగర్ : నటుడు రెనాల్డ్ పీటర్ ప్రిన్స్ హత్య కేసులో బెంగళూరు నటి శ్రుతిని అరెస్ట్ చేశారు. నెల్లై జిల్లా నాంగునేరి సమీపాన గల పరప్పాడికి చెందిన రెనాల్డ్ పీటర్ ప్రిన్స్ (36) మెకానికల్ ఇంజినీర్. ఈయన కంప్యూటర్ విద్యను అభ్యసించారు. తెన్‌కాశి పావూర్ సత్రం ఆలంగుడం తదితర ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్లు నడుపుతూ వచ్చాడు. ఆ తరువాత వాటిని వేరొకరికి అప్పగించి ఆన్‌లైన్ వ్యాపారంలో నిమగ్నమయ్యేందుకు చెన్నైకు చేరుకున్నాడు. మదురవాయల్‌లో ఉంటూ చిత్రాలకు ఫైనాన్స్ చేస్తూ వచ్చారు. కాగిత పురం, కొక్కిరకులం, నెల్లైమావట్టం చిత్రాల్లో నటించారు. ఇలా ఉండగా బెంగళూరుకు చెందిన సినిమా సహాయ నటి శ్రతి చంద్రలేఖతో రెనాల్డ్‌కు పరిచయమేర్పడింది.
అతని వద్ద బాగా డబ్బున్నట్లు తెలుసుకున్న శ్రుతి రెనాల్డ్ వ్యాపారంలో భాగస్వామి అయిన ఉమాచంద్రన్‌తో కలసి అతన్ని హతమార్చేందుకు పథకం వేసింది. దీంతో గత జనవరి మదురవాయల్ నుంచి రెనాల్డ్‌ను కారులో కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆ తరువాత పాళయం కోటలో అతని మృతదేహాన్ని పాతిపెట్టి ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయారు. ఇలా ఉండగా నటి శ్రుతి మదురవాయల్ పోలీసులకు తన భర్త రెనాల్డ్ కనిపించడం లేదని అతని ఆచూకీ కనుగొనాలంటూ నాటకమాడింది. దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు పత్రం అందచేసింది. దీంతో వారు ఇరువురూ భార్యాభర్తలుగా జీవించినట్లు ధ్రువపడింది. ఆ తరువాత పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని వెళ్లింది.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత రెనాల్డ్ సోదరుడు జస్టిన్ తిరునెల్వేలి నుంచి కారు ద్వారా చెన్నై చేరుకున్నారు. మదురై సమీపాన గల తిరుమంగళం వద్ద ప్రిన్స్ కారు కనిపించింది. ఆ కారులో నాగర్‌కోవిల్‌కు చెందిన సునీల్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని వద్ద కారు గురించి ప్రశ్నించగా అతడు ఉమాచంద్రన్ అనే వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలకు భేరమాట్లాడి ఒక లక్ష అడ్వాన్సుగా చెల్లించి తీసుకున్నట్లు తెలిపారు. ఇది వరకే ప్రిన్స్‌కు ఉమాచంద్రన్‌కు మధ్య వివాదం ఉన్నట్లు తెలుసుకున్న జస్టిన్ దీనిపై అనుమానించి పాళయం కోట్టై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గత ఎనిమిది నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శ్రుతి బెంగళూరుకు పరారైనట్టు తెలిసింది.
ఈ కేసు విచారణను కోయంబేడులో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డెప్యూటీ కమిషనర్ మోహన్‌రాజ్ చేపట్టారు. మదురవాయల్ సబ్ ఇన్‌స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలోని పోలీసులు బెంగళూరులో శ్రుతిని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి చెన్నైకు తీసుకువచ్చారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.