న్యూఢిల్లీ: కోర్టుల్లో న్యాయపోరాటం అనేది చాలా ఖరీదైపోయిందని, సామాన్యులకు అందనంత స్థాయికి చేరుకుందని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయవాద వృత్తి వ్యాపారమైపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయం వ్యాపారం కాదని హితవు పలికింది. మరోవైపు న్యాయవిచారణ చాలా ఆలస్యంగా సాగుతోందని, ఫలితంగా ఒక కేసు పరిష్కారమయ్యేసరికి తమ జీవితకాలం సరిపోదనే అభిప్రాయంలో దేశప్రజలు ఉన్నారని ప్రస్తావించింది. ఒకప్పుడు ఎంతో గౌరవమైన న్యాయవృత్తి ఇప్పుడు అదొక వ్యాపారంగా పరిణామం చెందుతోందని గత వారం ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బోద్బేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయపాలనలో న్యాయమూర్తులతో న్యాయవాదులు భాగస్వాములేనని స్పష్టం చేసింది. కోర్టు విధులు నిరాటంకంగా జరిగేలా చూడటం న్యాయవాది బాధ్యత అని పేర్కొంది.
స్వలాభం కోసం కక్షిదారుల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించడం న్యాయవాదికి శ్రేయస్కరం కాదని హితవు పలికింది. చిక్కుల్లోనున్న వ్యక్తిని న్యాయవాది కాపాడాలే తప్ప నిస్సహాయుడైన కక్షిదారుని దోపిడీ చేయకూడదని ఉద్బోధించింది. ఒకవేళ కేసు వాదనలకు మరో న్యాయవాదిని ఆశ్రయించినా అందుకు సహకరించాలని సూచించింది. పిటిషన్‌పై సంతకం చేసిన న్యాయవాది (అడ్వొకేట్ ఆన్ రికార్డు) అతిథి నటుడు కాదని, కక్షిదారుల తరఫున సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడానికైనా వారే అర్హులని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
న్యాయవాద వృత్తి వ్యాపారం కారాదు
Published Mon, Aug 26 2013 1:19 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement