న్యూఢిల్లీ: ఆకాశంలో సగం మాదే అని సగర్వంగా చెప్పుకుంటున్న భారత మహిళలు ఉన్నత విద్యలో ఇంతకుముందు కన్నా ఎంతో ముందుకు దూసుకుపోతున్న కార్మిక శక్తిలో మాత్రం ఇంతకుముందు కన్నా వెనకబడి పోతున్నారు. ఉన్నత విద్యలో మహిళలు 2007లో 39 శాతం ఉండగా, అది 2014 నాటికి 46 శాతానికి పెరిగింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1999లో భారత్‌లో మహిళల కార్మిక శక్తి 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. మహిళా కార్మికుల్లో ప్రపంచ సగటు 50 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 27 శాతానికి పడిపోవడం విచారకర పరిణామం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ సగటు 63 శాతం ఉండడం గమనార్హం. ఉన్నత విద్యలో మహిళల శాతం ఏటేటా పెరుగుతున్నప్పటికీ కార్మిక శక్తిలో మాత్రం ఎందుకు వెనకబడి పోతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లేకనా? వర్క్ ప్లేస్‌లో సరైన వసతులు లేకనా?
పలు రంగాల్లో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్, రవాణా వ్యవస్థలతోపాటు, రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎందుకు మహిళలు కార్మిక శక్తిలో వెనకబడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. మహిళలు పెళ్లి చేసుకొని ఇంటిపట్టునే ఉండాలనే సామాజిక ధోరణి ఇప్పటికీ కొనసాగడమే అందుకు కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం నానుడి కనుమరగయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వారంటున్నారు.
పదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు విద్యా సంస్థల్లోకి యువతుల ప్రవేశం యువకులకన్నా ఎక్కువగా ఉంటునప్పటికీ ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఎంఫిల్, పీహెచ్‌డీలలో మగవాళ్లతో పోలిస్తే వారు ఇంకా వెనకబడే ఉన్నారు. దానికి కారణం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో యుక్త వయస్సులోనే ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడం కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ దేశంలో సగటు మహిళలను తీసుకుంటే ఉన్నత విద్యలో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉన్నత విద్యలో 2012-13 సంవత్సరంలో మహిళలు 20.8 శాతం ఉండగా, మహిళల సంఖ్య 2014-15 సంవత్సరం నాటికి 23.6 శాతానికి పెరిగింది. అయితే ఇది గ్లోబల్ సగటు 27 శాతం కన్నా తక్కువే. ఈ సగటు చైనాలో 26 శాతం ఉండగా, బ్రెజిల్‌లో 36 శాతం ఉంది.
దేశంలో యువకులు సరాసరి సగటున 23.5 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటోండగా, యువతులు సరాసరి సగటున 19.2 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళల్లో కూడా పెళ్లి చేసుకునే వయస్సు పెరిగినప్పటికీ వారి కార్మిక శక్తి మాత్రం తగ్గుతోంది. భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పుడల్లా మహిళా కార్మిక శక్తి పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మహిళల్లో విద్యా స్థాయి పెరగడంతోపాటు మహిళాకార్మిక శక్తికి విలువ పెరిగినప్పుడే భారత్‌లో మహిళా కార్మిక శక్తి పెరుగుతోందని సూత్రీకరించింది.
భారత్‌లో పడిపోతున్న మహిళా కార్మిక శక్తి
Published Fri, Jul 29 2016 6:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement