ఇరకాటంలో సిద్ధూ
న్యూఢిల్లీ: 'నేను రాజకీయాల్లోకి రానని చెప్పారు. కానీ ఆమ్ ఆద్మీ పేరుతో పార్టీ పెట్టారు. వ్యక్తిగత భద్రత తీసుకోనని ప్రకటించారు. తర్వాత జడ్ కేటగిరీ భద్రత పెట్టించుకున్నారు. నేను ప్రభుత్వ బంగ్లా తీసుకోనని అన్నారు. ఈ మాట కూడా నిలుపుకోకుండా ప్రభుత్వ బంగ్లా తీసుకున్నారు. అంతేకాదు స్వయంగా ఆయనే ఫ్లోరింగ్ శుభ్రం చేసుకుంటారు... నేను చెప్పిదంతా అబద్ధమా' ఇవి 'ఆప్' జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గతంలో మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సిద్ధూ.. 'ఆప్'లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 'ఆప్' తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై సిద్ధూ పలు సందర్భాల్లో గతంలో చేసిన విమర్శలను ఆయన ప్రత్యర్థులు వెలుగులోకి తెస్తున్నారు. ఆందోళనల పేరుతో కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నారని సిద్ధూ చేసిన విమర్శల వీడియోను బయటపెట్టారు. మంచి వక్తగా పేరు పొందిన సిద్ధూ దీంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఒకవేళ ఆయన ఆప్ చేరితే డ్రామాలు చేస్తున్నారని ఆరోపించిన కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. 'సామాన్య సీఎం'కు వ్యతిరేకంగా చేసిన విమర్శలను సిద్ధూ ఏవిధంగా సమర్థించుకుంటారో చూడాలి. కాగా తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారని సిద్ధూ భార్య నవ్జోత్ కౌర్ సిద్ధూ వెల్లడించారు.