ఢిల్లీలో భేటీ సందర్భంగా అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన, క్లిష్టమైన సాంకేతికతను అమెరికా భారత్‌కు సమకూర్చే చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఢిల్లీలో గురువారం ఫలప్రదంగా జరిగిన ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల(2+2) మంత్రుల తొలి సమావేశం ఇందుకు వేదికైంది. కామ్‌కాసా(కమ్యూనికేషన్స్, కంపాటిబిలిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్)గా పిలిచే ఈ ఒప్పందంపై చాన్నాళ్లుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి.
ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, రష్యా నుంచి భారత్ కొనుగోలుచేయనున్న ఎస్–400 క్షిపణులు, హెచ్–1బీ వీసా, సీమాంతర ఉగ్రవాదం, ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి, ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న యత్నాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మైకేల్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్‌లు చర్చల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రెండు దేశాల త్రివిధ దళాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
రష్యాతో సంబంధాలను అర్థం చేసుకుంటాం..
ఇంధన అవసరాల కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్న సంగతిని భారత్ అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయంలో సాయం చేస్తామని అమెరికా భారత్‌కు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్షిపణుల కొనుగోలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భారత్–రష్యాల చారిత్రక సంబంధాలను అర్థం చేసుకుంటామని అమెరికా పేర్కొన్నట్లు వెల్లడించాయి. అమెరికాతో వ్యూహాత్మక సహకారంపై రష్యాతో సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపవని భారత్ అమెరికాకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
చర్చలు ముగిసిన అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో సుష్మా స్వరాజ్ తొలి 2+2 భేటీ అజెండాపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపునకు భారత్ మద్దతిస్తుందని తెలిపారు. కామ్‌కాసా ఇరు దేశాల సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పోంపియో పేర్కొన్నారు. భారత రక్షణ సామర్థ్యం, సన్నద్ధతను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
కామ్‌కాసా అంటే..
ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి భారత్‌కు అత్యాధునిక మిలిటరీ కమ్యూనికేషన్ పరికరాలు అందుతాయి. ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కీలక సమాచారాన్ని సంకేత భాషలో పంచుకునేందుకు వీలు కలుగుతుంది. సత్వరమే అమల్లోకి వచ్చే ఈ ఒప్పం దం పదేళ్లపాటు అమల్లో ఉంటుంది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే యుద్ధ విమానాలు, ఇతర హెలికాప్టర్లలో అమెరికాకు చెందిన అత్యంత భద్రమైన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను అమరుస్తారు.
సి–17, సి–130జే, పి–81 విమానాలతో పాటు, అపాచె, చింకూర్ హెలికాప్టర్లలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇరు దేశాల సైనికుల మధ్య సమాచార మార్పిడి మరింత విస్తృతం అవుతుంది. ఉదాహరణకు భారత్ వైపు చైనా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు రావడాన్ని అమెరికా యుద్ధ విమానాలు గుర్తిస్తే భారత్‌కు ఆ సమాచారం క్షణాల్లోనే చేరిపోతుంది. శత్రు దేశాల యుద్ధ విమానాల ఉనికిని పసిగట్టే సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment