అరెస్టు లేని పోలీస్ స్టేషన్!
జైసల్మీర్: పోలీస్ స్టేషన్‌లో అసలు కేసులు నమోదు కాకపోవడం, కేసు అయినా అరెస్టు చేసేంతవి కాకపోవడం ఎక్కడైనా చూశామంటే అది సినిమాలోనే.. కానీ, నిజంగా అలాంటి పోలిస్ స్టేషన్ ఒకటి ఉంది. రాజస్థాన్ లోని జైసల్మీర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో షాఘర్ బుల్జ్‌లో ఉన్న ఈ స్టేషన్‌లో 23 ఏళ్లుగా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఇప్పటివరకు ఆ ఊరిలో కేవలం 55 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో 9,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క బిల్డింగ్ కూడా పోలీస్ స్టేషనే. కానీ స్టేషన్‌కు నీరు, కరెంటు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో లేవు. దగ్గరలో ఎటువంటి గ్రామాలు లేని షాఘర్ బుల్జ్ లో నివసించేది దాదాపు 900 మంది. అతిపెద్ద విస్తీర్ణం కలిగిన ప్రాంతం కావడంతో గ్రామస్తులు ఇక్కడ ఇళ్లను దూరంగా నిర్మించుకున్నారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కారాగారాలు కలిగిన ఉన్న ఈ స్టేషన్ లో ఇప్పటివరకు ఒక్కరిని కూడా బంధించలేదు. ఈ స్టేషన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏ పోలీసు అధికారినైనా పోలీసుశాఖ శిక్షించదలుచుకుంటే అతన్ని ఇక్కడికి బదిలీ చేస్తోంది. ఇక్కడి నుంచి జైసల్మీర్ కు వెళ్లాలంటే బోర్డర్ నుంచి పట్టణానికి వెళ్తున్న బీఎస్ఎఫ్ వాహనాల సాయం తీసుకోవాల్సిందే.
మొత్తం 15 మంది సిబ్బందిని పోలీసు శాఖ ఈ స్టేషన్ కు కేటాయించగా ప్రస్తుతం ఆరుగురు విధుల్లో ఉన్నారు. బోర్డర్ లో ఫెన్సింగ్ వేయకముందు ఈ ప్రాంతంలో డ్రగ్స్ రవాణా తదితరాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అలాంటివి ఏమి లేవని ఏఎస్‌ఐ రాజీవ్ పచార్ తెలిపారు. 1993లో ఈ పోలీసు స్టేషన్ ను ఏర్పాటు చేయగా 1994లో సెక్షన్ 302 కింద ఒక కేసు, 2006లో సెక్షన్ 307 కింద మరో కేసు మాత్రమే నమోదయినట్లు పచార్ వివరించారు. ఇప్పటివరకు ఒక్క రేప్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. త్వరలో స్టేషన్ కు కరెంటు సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. స్టేషన్ శాటిలైట్ ఫోన్, ఒక జీప్ కూడా ఉన్నాయి.
గత పదేళ్లలో కేసులు
2005-0
2006-1
2007-2
2008-1
2009-0
2010-0
2011-1
2012-4
2013-2
2014-2
2015-3
2016-0(ఇప్పటివరకు)