యుద్ధభూమిలో భార్యలకు అనుమతి
జైసల్మీర్: సైనికులకు శుభవార్త.. అలాగే, భావి భారత సైనికులకు కూడా తీపికబురు. తమతో తమ భార్యలు లేరే.. కుటుంబం దూరంగా ఉందే అనే బెంగకు త్వరలో ఉపశమనం కలగనుంది. కొత్తగా పెళ్లయిన సైనికుడికి ఏడాదిపాటు తన భార్యను తనతోటే ఉండే అవకాశం ఏర్పడనుంది. ఈ మేరకు భారత ఆర్మీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఇతర బలగాలు సరిహద్దుల్లో కుటుంబాన్ని వదిలేసి ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారయితే.. పెళ్లయిన కొద్ది రోజుల్లేనే ఉన్నపలంగా భార్యను వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. సినిమాలో చూపించినట్లుగా వారి బాధ, మానసిక వ్యధ వర్ణానానీతం.
ఈ నేపథ్యంలోనే కొత్తగా పెళ్లయిన సైనికుడిని యుద్ధ భూమిలోనే ఓ ఏడాదిపాటు తన భార్యతో ఉండే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ రెండు రోజుల కిందట జవాన్లతో అయిన సమావేశంలో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు బీఎస్ఎఫ్ రాజ్ ఫ్రాంటియర్ ఐజీ బీఆర్ మెఘ్వాల్ వెల్లడిస్తూ..
'ఇది ఎంతో కాలంగా బయటకు వినిపించని డిమాండ్. అప్పుడే వివాహం చేసుకున్న సైనికుడు బాధ్యత రీత్యా ఉన్నపలంగా తన భార్యను వదిలేసి తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇది అతడి పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపధ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అది కూడా ప్రారంభ దశలో ఉంది. జవాన్లతోపాటు వారి భార్యలు ఏడాది ఉండొచ్చు. అందుకోసం వారికి కుటుంబ వాతావరణం ఉండేలా సరిహద్దులో నిర్మాణాలు కూడా చేపడతాం. అది కూడా పరిపాలక భవనం సమీపంలో చేపడతాం' అని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం వల్ల కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా ఉంటున్నామన్న భావనపోయి సైనికుడి సామర్థ్యం తప్పకుండా పెరుగుతుందని ఆయన చెప్పారు.