మీ భాగస్వామితో విడిపోయారా..!
అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన ‘వినా ముల్యే అమూల్య సేవ’ పేరుతో ఓ సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మధ్య వయసులో ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారికి కొత్త భాగస్వామిని అందించే చర్యకు ఉపక్రమించింది. ఇందుకోసం పది రోజుల షిమ్లా పర్యాటనను సిద్ధం చేసింది. మిగితా టూర్ల మాదిరిగా కాకుండా చాలా తక్కువ ధరల్లోనే ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనిలో నమోదుకావాలనుకునేవారు కేవలం రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో హోటల్ ఖర్చు, ఆహారం, ఆయా ప్రాంతాల సందర్శన, లగ్జరీ బస్సులో ప్రయాణం ఉంటుంది.
35 ఏళ్ల నుంచి ఆ పైన వయసు ఉండి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నవారు, భర్త చనిపోయినవారు, భార్య చనిపోయినవారు ఈ టూర్‌కోసం తమ పేరును నమోదు చేసుకోవచ్చు. ఇందులో మరోసదుపాయం ఏమిటంటే మహిళలకు ట్రాన్స్‌పోర్టేషన్ టారిఫ్స్ ఉండవట. భారతీ రావల్ అనే వ్యక్తి ఈ టూర్ వివరాలు తెలియజేస్తూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని ఒక్క గుజరాత్ నుంచే కాకుండా బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా పలువురు తమ పేర్లను నమోదు చేసుకున్నారట.
వీళ్లలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. ఓ ఇద్దరు ఎన్నారైలు, ఓ 85 ఏళ్ల వ్యక్తి, 72 ఏళ్ల మహిళ కూడా ఉందని ఆయన తెలిపారు. ఒంటరిగా ఉంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నవారికి ఈ పర్యటన ఓదార్పునివ్వడమే కాకుండా ఈ పది రోజుల్లో వారు ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా ఒక భాగస్వామిని ఎంచుకున్నట్లవుతుందని, ఇది తమ దృష్టిలో మానవతా దృక్పథంతో చేసే సేవ అని పేర్కొన్నారు.