- జైతాపూర్ ప్లాంట్‌పై హోలాండ్‌తో చర్చలు
న్యూఢిల్లీ: జైతాపూర్ అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి పురోగతి సాధించే దిశగా భారత్, ఫ్రాన్స్‌లు తీవ్రంగా కృషి చేస్తున్నాయని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి రిచీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం నుంచి ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రిచీర్ మంగళవారం పై సంగతి తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన అరేవా.. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో10 వేల మెగావాట్ల సామర్థ్యం గల 6 అణు రియాక్టర్లు నెలకొల్పేలా 2009లో ఒప్పందం కుదిరింది. ఇందులో ఉత్పత్తి చేసే విద్యుత్తు ధర అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.
యూనిట్ విద్యుత్ ధరను రూ. 9 నుంచి రూ. 9.30 మధ్య నిర్ణయించాలని అరేవా చెప్తుండగా, ఆ ధర రూ. 6 నుంచి రూ. 6.30 మధ్య ఉండాలని భారత్ పట్టుపడుతోంది. మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో జరిపే చర్చల్లో జైతాపూర్ అంశం ప్రధానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత జర్మనీ, కెనడాలలోనూ మోదీ పర్యటించనున్నారు. కాగా, పెండింగ్‌లో ఉన్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మోదీతో చర్చిస్తామని హోలాండ్ తెలిపారు.