న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యత అవసరం ఉండే పోస్టుల్లో ప్రైవేటు రంగానికి చెందిన నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయా పోస్టులను గుర్తించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. పరిశ్రమలు, విద్యారంగంతోపాటు ఇతర రంగాల్లోని నిపుణుల సేవలను వినియోగించుకోవడానికి పరిపాలనా సంస్కరణలు తీసుకువస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తోంది.
ఇదేకాక అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శికి సమానమైన ప్రభుత్వ పోస్టుల్లో సాంకేతిక నైపుణ్యం ఉన్న ప్రైవేటురంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులను నియమించాలని ఆరోవేతన సంఘం కూడా సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) దీనిపై ఓ విధాన పత్రాన్ని రూపొందించింది.