శివసేన ఎంపీలకు బెర్తులు ఖరారు
న్యూఢిల్లీ: బీజేపీ, శివసేనల మధ్య చోటు చేసుకున్న వివాదం సద్దుమణిగిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు. మోడీ కేబినెట్ తొలి విస్తరణలో చేరేది లేదని భీష్మించుకుని శివసేన దిగి వచ్చింది. ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చి ఆదివారం మధ్యాహ్నం ఇచ్చిన అల్పాహార విందుకు శివసేన పార్టీ సీనియర్ నేత సురేష్ ప్రభు హాజరయ్యారు. కేబినెట్ విస్తరణలో ప్రభుకు కేబినెట్ ర్యాంకు ఇవ్వాలని మోడీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పార్టీకి చెందిన అనిల్ దేశాయ్కి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ఉదయం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో అసెంబ్లీ స్థానాల విషయంలో బీజేపీ, శివసేనల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో దాదాపు రెండు దశాబ్దాల పొత్తుకు ఆ రెండు పార్టీలు చరమగీతం పాడాయి. ఈ నేపథ్యంలో మోడీ తొలి కేబినెట్ విస్తరణలో చేరేందుకు శివసేన నిరాకరించింది. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగి... చర్చలు జరిపింది. దీంతో ఆ చర్చలు సఫలీకృతమైనాయి. దీంతో మోడీ కేబినెట్లో శివసేనకు రెండు బర్త్లకు ఖరారైయ్యాయి.