పాలమూరు ప్రాజెక్టుపై కౌంటర్ దాఖలు చేయండి
తెలంగాణ, ఏపీలకు సుప్రీంకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మిస్తోందని, దీని నిర్మాణం వల్ల తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లనుందని ఏపీకి చెందిన రైతు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చినప్పటికీ ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేయలేదు.
తాజాగా శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి వాదనలు వినిపిస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా సంబంధిత అనుమతులు తీసుకోవాలని, కానీ అనుమతులు తీసుకోకుండానే ఇటీవల ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి కూడా వేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వెంటనే ప్రాజెక్టు పనులు ఆపేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. అయితే తాము చేపట్టిన ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే మొదలుపెట్టిందని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం చేసిన చట్టాన్ని గౌరవించే ప్రాజెక్టులను నిర్మాణం చేసుకోవాల్సి ఉందన్నారు.
తమకు ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని వైద్యనాథన్ కోరగా న్యాయమూర్తులు అంగీకరించారు. నాలుగు వారాల గడువునిచ్చారు. రెండు రాష్ట్రాలు ఆలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి రెండు వారాలు ప్రతిస్పందనలు తెలిపేందుకు అవకాశమిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. జూలై 20న తుది విచారణ చేపడతామని, అదేరోజున ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. విచారణలో తదుపరి గడువు కోరరాదని సూచించింది. ఈ కేసులో కేంద్ర జలసంఘం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. తమకీ ప్రాజెక్టుపై ఎలాంటి సమగ్ర నివేదిక అందలేదని తెలిపింది. విచారణలో ఏపీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు, గుంటూరు ప్రభాకర్, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు, రైతుల తరపున న్యాయవాది పి.ప్రభాకర్ పాల్గొన్నారు.