ప్రేమ.. ఓ విద్యార్థి.. ఓ టీచర్.. హత్య
రాంఛీ: ప్రేమ పేరుతో తమ కూతురు వెంటపడుతున్నాడనే కారణంతో ఏడో తరగతి బాలుడిని ఓ టీచర్ హత్య చేసిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సఫైర్ ఇంటర్నేషనల్ స్కూల్లో వినయ్ మహతో అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ స్కూల్లోనే పనిచేస్తున్న 30 ఏళ్ల నజ్మా ఖతూన్ అనే హిందీ టీచర్కు పదకొండేళ్ల కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా వినయ్ ఆమె కూతురు వెంటపడటం ప్రారంభించాడు.
దీంతో ఆ బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో సహించలేని ఆ టీచర్, ఆమె భర్త విద్యార్థిని కొట్టి చంపేశారు. దీని ఆధారాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 1.09గంటల ప్రాంతంలో ఆ విద్యార్థి తన హాస్టల్ భవనం దాటి తన టీచర్ ఉండే నివాసం వైపు కదిలాడు. ఆ తర్వాత అర్థగంటలోనే అతడు టీచర్స్ హాస్టల్స్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ వద్ద తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్నట్లు మరో టీచర్ గుర్తించింది.
దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఎవరైనా ఆ విద్యార్థిపై లైంగికదాడికి ప్రయత్నించి అనంతరం హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. కానీ, మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత అలాంటి కోణంలో ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఆ బాలుడి ప్రవర్తన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రేమ కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. ఆ రోజు రాత్రి విద్యార్థి తమ ఇంటికి వస్తాడని ముందే తెలుసుకొని మాటువేసి ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు అతడిని తీవ్రంగా కొట్టి మొదటి అంతస్తుపై నుంచి కిందపడేశారు. ఈ కారణంగానే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం మొత్తాన్ని పోలీసులు అరెస్టు చేశారు.