తొలిరోజే వాయిదాపర్వం
పలు అంశాలపై ఉభయసభలను అడ్డుకున్న విపక్షాలు
► సహరాన్‌పూర్ అల్లర్లపై రాజ్యసభలో మాయావతి ప్రసంగం
► త్వరగా ముగించాలన్న డిప్యూటీ చైర్మన్ కురియన్
► ఆగ్రహించిన మాయావతి.. కురియన్‌తో వాగ్వాదం.. వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే విపక్షాల నిరసనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. దళితులు, మైనారిటీలపై దాడులతో రాజ్యసభలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టడంతోపాటు సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగింది. మాయావతి, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య వాగ్వాదం జరగటంతోపాటు విపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయటంతో రాజ్యసభ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్‌సభలోనూ విపక్షాల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. రైతుల సమస్యలు, గోరక్ష పేరుతో జరుగుతున్న దాడులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించటంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మాయావతికి కోపమొచ్చింది!
మంగళవారం సభ ప్రారంభం కాగానే విపక్షాలు దళిత–మైనారిటీలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. దీనికి డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదం తెలిపారు. బీఎస్పీ సభ్యురాలు మాయావతి నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే చర్చను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఇటీవల జరిగిన హింస పట్ల ప్రభుత్వంపై మాయావతి పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతుండగా ప్రసంగాన్ని తొందరగా ముగించాలని కురియన్ సూచించారు. తనకు ఇచ్చిన సమయంకంటే.. అదనంగా 3 నిమిషాల సేపు మాయావతి మాట్లాడటంతో కురియన్ ఈ సూచన చేశారు.
దీంతో ఆగ్రహించిన మాయావతి ‘నా దళిత సమాజం గురించి మాట్లాడుతుంటే మీరెలా అడ్డుకుంటారు?’ అంటూ కురియన్‌తో వాగ్వాదానికి దిగారు. ‘నేను చెప్పాలనుకున్నది పూర్తి కాలేదు. ఇలా అడ్డుతగలొద్దు. మాపై ఆధిపత్యం సరికాదు. దళితులపై జరుగుతున్న దాడులపై నా అభిప్రాయాలను వ్యక్తపరచలేనప్పుడు సభలో ఉండే నైతిక హక్కు నాకు లేదు. నేడే రాజ్యసభకు రాజీనామా చేస్తాను’ అని ఆగ్రహించారు.
దీనికి కురియన్ స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రసంగం చేయకుండా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాలని.. కావాలంటే రూల్ 267 కింద వాయిదా తీర్మానం ఇచ్చి చర్చను కోరవచ్చని సూచించారు. కురియన్ విజ్ఞప్తిని తిరస్కరించిన మాయావతి.. ‘రాజ్యసభకు రాజీనామా చేస్తున్నాను’ అంటూ వాకౌట్ చేశారు. అయితే డిప్యూటీ చైర్మన్‌ను మాయావతి అవమానించారని.. ఆమె క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు.
మాయా రాజీనామా
బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం రాజ్యసభలో సహరాన్‌పూర్ అల్లర్లపై తన ప్రసంగాన్ని అడ్డుకోవటంతో మనస్తాపం చెందిన మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ‘చైర్మన్‌ను కలసి రాజీనామా సమర్పించాను. నాకు సంబంధించిన అంశాలపైనా సభలో మాట్లాడే అవకాశం రాకపోవటం సరికాదు. నేను మాట్లాడేందుకు నిలబడగానే ప్రభుత్వం నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అధికార సభ్యులు పదేపదే నా ప్రసంగానికి అడ్డుతగిలారు. ఇది మంచిది కాదు’ అని అన్సారీని కలసిన అనంతరం మాయావతి పేర్కొన్నారు. ఆమెకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పదవీకాలం ఉంది.