కొత్త డిజైన్లలో చిన్న నోట్లు
న్యూఢిల్లీ: కొత్త రూ.2 వేల నోటు, రూ. 500 నోట్లలోని డిజైన్, భద్రతా ప్రమాణాలు మిగతా నోట్లకు కూడా త్వరలో అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్ లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. దీనివల్ల దొంగనోట్ల చలామణి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క.. త్వరలో మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా రూ. 500 నోట్లను విడుదల చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోటు రెండు నెంబర్ ప్యానళ్లపై ‘ఈ’ ఇంగ్లిషు అక్షరం ఉంటుందని, నోటు రెండో వైపు స్వచ్ఛ భారత్ చిహ్నం ముద్రిస్తారని పేర్కొంది. కొన్ని బ్యాంకు నోట్లకు అదనంగా నంబర్ ప్యానళ్లలో (స్టార్) గుర్తు ఉంటుందని తెలిపింది.
స్టార్ గుర్తుతో రూ. 500 నోటు మొదటి సారి జారీ చేస్తున్నామని, స్టార్ గుర్తుతో ఉన్న రూ.10, రూ. 20, రూ. 50, రూ.100 నోట్లు ఇప్పటికే చెలామణీలో ఉన్నాయని వెల్లడించింది. ఆధార్ అనుసంధాన డిజిటల్ చెల్లింపుల కోసం త్వరలో మొబైల్ యాప్‌ను విడుదల చేస్తున్నామని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ–చెల్లింపులపై కోటి మంది ప్రజలకు దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. యూపీఏ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) కోసం మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
పార్టీల డిపాజిట్లపై పన్ను ఉండదు: కేంద్రం
న్యూఢిల్లీ: రద్దయిన రూ. 500, రూ. వెయ్యి నోట్ల రూపంలో రాజకీయ పార్టీలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాన్ కార్డు లేని పక్షంలో రైతులు తమ వార్షిక వ్యవసాయ ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువని పేర్కొంటూ సొంత ధ్రువీకరణ పత్రం చెల్లించాలని సూచించింది. ఆదాయపు పన్ను రిట్నర్న్స్‌తో వారి ఖాతాల్లోని నగదు సరిపోలకపోవడంతో ఐటీ శాఖ 3 వేల నోటీసులు జారీ చేసిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్(సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. ఇంత వరకూ రూ.385 కోట్ల నగదు, ఆభరణాల్ని ఐటీ శాఖ సీజ్ చేసినట్లు తెలిపారు.
‘జనవరి మధ్య నాటికి నగదు కొరత ఉండదు’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడ్డ నగదు కొరత జనవరి మధ్య నాటికి ఉండదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు వీలుగా ప్రజలందరూ డిజిటల్ చెల్లింపులు చేసేందుకు గల అన్ని అవకాశాలను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అమితాబ్ కాంత్ నేతృత్వం వహిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 80 శాతం లావాదేవీలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో జరిపేందుకు ఉన్న అవకాశాలను కమిటీ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. 7.5 శాతం వృద్ధి సాధించాలంటే డిజిటైజేషన్ ప్రధానమైనదని ఉద్ఘాటించారు.