ఇద్దరు భార్యలుంటే నో జాబ్!
ఆగ్రా: ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అనర్హులని నోటిఫికేషన్లో పేర్కొనడంతో ముస్లిం సంఘాలు దీనిని పెద్ద ఎత్తున నిరసిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే...అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,500 ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో జీవించి ఉన్న ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు భార్యలున్న భర్తకు భార్యగా ఉంటే...ఆ మహిళా అభ్యర్థులను సైతం అనర్హులుగా ప్రకటించారు.
దీనిపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా తలెత్తే సమస్యలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కేవలం ఉర్దూ ఉపాద్యాయుల నియామకంలోనే కాకుండా మిగతా పోస్టుల భర్తీలో సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ముస్లిం వర్గాలు మాత్రం.. తమ మత చట్టాల ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని... ఎప్పుడో పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతాయనే నెపంతో ఇప్పుడు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి. అయినా పెన్షన్ను ఇద్దరికీ సమానంగా పంచితే సరిపోతుందని, ఈ నిర్ణయం తమ పట్ల వివక్ష చూపించడమే అంటున్నాయి.