మహిళలూ.. కత్తులు తీసుకెళ్లచ్చు!
మహిళలూ.. కత్తులు తీసుకెళ్లచ్చు!
Published Fri, Jan 6 2017 6:43 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలు తమ భద్రత కోసం చిన్నపాటి కత్తులు, లైటర్లు, అగ్గిపెట్టెల లాంటి వాటిని తీసుకెళ్లచ్చు. మహిళలపై పెరుగుతున్న వేధింపుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది మహిళలు వీటిని తెస్తున్నా, భద్రతా సిబ్బంది వాటిని వెనక్కి తీసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లలో భద్రతా వ్యవహారాలు చూసే సీఐఎస్ఎఫ్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు నిషేధిత వస్తువుల జాబితాలో ఉన్న చిన్న కత్తులు, లైటర్లు, అగ్గిపెట్టెలను ఆ జాబితా నుంచి తొలగించారు. ఢిల్లీ శాస్త్రి పార్కులోని మెట్రోడిపోలో వేలకొద్దీ చిన్న కత్తులు, లైటర్ల లాంటివి పేరుకుపోతుండటంతో సీఐఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
రోజుకు సగటున వంద వరకు లైటర్లు, అగ్గిపెట్టెలను తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఐఎస్ఎఫ్ చెబుతోంది. ఇప్పుడు వీటిని అనుమతించడంతో పాటు కూలీలు తీసుకెళ్లే పనిముట్లను కూడా అనుమతిస్తున్నామని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, వాటిని ముందుగా తాము పరిశీలించి, ప్రయాణికులకు నిజంగా అవి అవసరమో కాదో తెలుసుకుని ఒక రిజిస్టర్‌లో నమోదుచేస్తామని వివరించారు. ఇక కొన్ని మతాలకు చెందినవారు కొన్ని కొన్ని వస్తువులను తప్పనిసరిగా తీసుకెళ్తారని, వాటికి కూడా మినహాయింపు ఇస్తున్నామని అన్నారు.
కొసమెరుపు
గడిచిన సంవత్సర కాలంలో ఢిల్లీ మెట్రోరైల్లో పట్టుకున్న పిక్ పాకెటర్లలో 91 శాతం మంది మహిళలేనని సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అంతకుముందు సంవత్సరం అయితే వీళ్ల సంఖ్య 93 శాతమట!!
Advertisement