అమిత్ షా రాయని డైరీ
ఇవాళ కూడా మోదీజీ అసౌకర్యంగానే కనిపించారు. నిన్నా అంతే, మొన్నా అంతే! బహుశా రేపు, ఎల్లుండి కూడా అంతే కావచ్చు. ఎల్లుండి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. అవి ఆయనకు లెక్కే కాదు. పైగా ‘ముఖాబ్లా’ కోసం ఉబలాటపడుతున్నట్టు మొన్న కశ్మీర్‌లో తనే చెప్పుకున్నారు.
మరి ఎందుకని మోదీజీ అసౌకర్యంగా ఉంటున్నారు?! నేను నచ్చట్లేదా? ఆయనకు బట్టలు కుట్టే దర్జీ నచ్చట్లేదా? బిహార్‌కు అప్పుడే ఎన్నికలు రావడం నచ్చట్లేదా! తెలియడం లేదు. కళ్లజోడులోంచి ఆ చూపుల ఎక్స్‌ప్రెషన్స్ పట్టుకోవడం కష్టంగా ఉంటోంది. ఈ మధ్యైతే మరీను! కళ్లలోకి చూస్తారు. చూస్తూ ఉంటారు. చూసి, చూసి చివర్న.. ‘సముఝే’ అన్నట్లు చూస్తారు! ఆంతరంగిక సలహాదారుకు కూడా అంతుచిక్కని విలక్షణత్వం ప్రపంచంలో మోదీజీ ఒక్కరిదేనేమో!
నేను నచ్చకపోతే నన్ను మార్చేయడం మోదీజీకి పెద్ద ఇష్యూ కాదు. ఇంకో ‘షా’ ఎవరైనా ఉంటే చూడమని నేరుగా నన్నే అడగ్గలరు ఆయన. ఏ ‘షా’ దొరక్కపోతే, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ షా నైనా తెచ్చిపెట్టమంటారు. లేదా తెచ్చి పెట్టుకుంటారు. నా మీద ‘షా’ వేసిన సెటైర్ మోదీజీకి బాగా నచ్చినట్టుంది. ‘నువ్వూ సరదాగా ఒకటి వెయ్’ అన్నారు. ‘మాటలెందుకు మోదీజీ, బిహార్‌లో గెలిచి చూపిద్దాం’ అన్నాను. ఆ మాటకు ఆయన హర్ట్ అయినట్లున్నారు! మోదీజీది పసిహృదయం. మాటలకు పడిపోతారు. మాటలతో ఆడుకునేవారికి మనసిచ్చేస్తారు. జనవరిలో నా టెర్మ్ అయిపోతుంది.
ఆలోపే రిటైర్డ్ హర్ట్ అవుతానేమోనని డౌట్. నేను హర్ట్ అవడం వల్ల కాదు. మోదీజీ హర్ట్ అవడం వల్ల! మోదీజీ నా పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక అంతకుముందే నన్ను ఆలింగనం చేసుకుంటారా అన్నది బిహార్ ఫలితాలను బట్టి ఉండొచ్చు. ఎప్పుడు టెర్మ్ అయిపోయినా, వె ళ్లేటప్పుడు మోదీజీకి చెప్పాలి... నన్ను మార్చినా పర్లేదు.. దర్జీని మార్చొద్దని. గుట్టుమట్లు తెలిసిన మనిషిని వదులుకుంటే నష్టం లేదు. చుట్టు కొలతలు తెలిసిన మనిషిని కాదనుకుంటే మన షేపే మారిపోతుంది. షేప్ దెబ్బతిన్నా నష్టం లేదు. మునుపటి షేప్‌లోకి వచ్చేస్తే మోదీజీ నుండి ఒబామా మళ్లీ వీసా లాగేసుకున్నా లాగేసుకుంటాడు.
టెర్మ్ అయ్యాక మోదీజీ నాకేం పోస్టు ఇస్తారో తెలీదు. పార్టీ పితృదేవులు అటల్‌జీ, అద్వానీ, జోషీ నా మీద గుర్రుగా ఉండి ఉంటారు... పార్లమెంటరీ బోర్డు నుంచి పీకి మార్గదర్శక్ మండల్‌లో పడేశా నని. ‘ఆ మండల్‌లోకే నువ్వు కూడా వెళ్లిపో’ అని మోదీజీ ఆజ్ఞాపిస్తే అప్పుడేం చేయాలి? ఇప్పటికి ఒక్కసారి కూడా సమావేశం కాని మండల్‌లోనే మిగతావారిలా మౌనగంభీరంగా ఉండిపోవడమా? లేక నా నియోజకవర్గం నారన్‌పురాకు వెళ్లిపోయి అచ్ఛే దిన్ కోసం ఎదురుచూడడమా? ఆలోచించాలి.
- మాధవ్ శింగరాజు