ఎవరి సాధికారతకు మహిళా రిజర్వేషన్లు?
సందర్భం
తన పదవిని లేక స్థానాన్ని ఖాళీ చేస్తున్న పురుషుడి ప్రయోజనం కోసం ఆ కుటుంబంలోనే ఒక మహిళను తీసుకొచ్చి అదే స్థానంలో కూర్చుండబెట్టడంగా మహిళా రిజర్వేషన్ అర్థం మార్చుకుంది. అక్కడ మహిళ నామమాత్రంగా ఉండిపోతుండగా, లావాదేవీలన్నింటినీ పురుషులే నిర్వహిస్తుంటారు
ముందుగా కాలంలో కాస్త వెనక్కు వెళదాం. సీపీఎం నా యకురాలు బృందాకారత్ ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫ రెన్సులో ప్రసంగిస్తున్నారు. పార్లమెంటులో, శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు కోటాను ముందుకు తీసుకుపోవడంలో అసమర్థంగా వ్యవహరించినందుకు ఆమె మునుపటి వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. ఎన్డీయే మహిళా వ్యతిరేక కూటమి అని ఆమె తర్కం.
ఈ విషయమై ప్రశ్నించినప్పుడు.. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత దాని భవిష్యత్తు ప్రభుత్వం చేతుల్లో కాకుండా ఎంపీల చేతుల్లోనే ఉంటుందని బృందా కారత్ అంగీకరించారు. మహిళలకు కోటా బిల్లును పార్లమెంటులో సీపీఎం సహ ప్రయాణికులైన ములా యంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ దృఢంగా వ్యతిరేకించారు. మహిళలకు కోటాను వీరు వ్యతిరేకిం చడంలో లింగ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నందున వీరి పార్టీలు కూడా సామాజిక బాధ్యతకు దూరంగా జరిగాయి.
ఆ ఉదంతానికి సంబంధించిన అంశాలు నేటికీ మార్పు చెందలేదు. ఆస్తి హక్కులు, విడిపోయిన అనంతరం ఆర్థిక స్వాంతంత్య్రం వంటి అంశాలతో పాటు మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ఎక్కడా వాదనలు ఉండవు. అంటే స్త్రీల విషయంలో సమాన త్వాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ రాజకీయ సాధికారతే ఇప్పటికీ కీలకంగా ఉంటోంది. స్థానిక సంస్థ ల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు తప్పనిసరిగా కల్పించాలని 73వ రాజ్యాంగ సవరణ నిర్దేశించింది.
ఇవి మహిళలకు సరిపోవు కానీ ఈ మాత్రం కోటా అమలు కూడా ఘోరంగా విఫలమైంది. ఇలాంటి ఉత్తమ విధానం కూడా రాజకీయ స్థాయిలో పూర్తిగా వక్రీకరణకు గురైంది. ఇది మనం పరిగణనలోకి తీసు కోలేని పరిణామాలకు దారితీసింది. ఉదాహరణకు, ఈ విధానం మహిళలను సాధారణ గృహాల నుంచి బయ టకు తీసుకువచ్చి చట్టసభల్లో కూర్చుండబెట్టగలిగిందా? పట్టణ పురపాలక సంస్థల్లో సగం సీట్లను మహిళలకు కేటాయించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు ఇటీవ లే ఒక ప్రకటన వచ్చింది. అంటే ఏ పురపాలక సంస్థలో అయినా పురుషులను, మహిళలను సంఖ్యాపరంగా సమాన స్థాయిలో నిలబెట్టగలిగే గణనీయ పెరుగుదల ఇది.
అయితే ఇది కూడా అసంపూర్ణమే. ఎందుకంటే మహళలకు ఉద్దేశించిన స్థానాలను వార్డులవారీగా రొటేట్ చేస్తారు. అంటే ఆ స్థానంలో ఇప్పటికే కూర్చుని ఉన్న పురుషులు ఒక టర్మ్ వరకు కొనసాగుతారు. తర్వాత అది మహిళల పరమౌతుంది. మన రాజకీయ నేతల దృష్టిలో అది పెద్ద నష్టమే కదా. ఈ నష్టాన్ని రాజకీయ పలుకుబడి, డబ్బురూపేణా లాభాల దృష్టిలో అంచనా వేస్తారు. డబ్బు సమకూరుతుంది కాబట్టే చాలామంది రాజకీయ నేతలు రాజకీయాలనే తమ కెరీర్లుగా మార్చుకున్నారు.
ఇది భూమిని కంపింపచేసే ఆవిష్కరణ కాదు కానీ, తన పదవిని లేక స్థానాన్ని ఖాళీ చేస్తున్న పురుషుడి ప్రయోజనం కోసం ఆ కుటుంబంలోనే ఒక మహిళను తీసుకొచ్చి అదే స్థానంలో కూర్చుండబెట్టడం ప్రధానమై పోయింది. ఈ పరిస్థితులలో మహిళ ప్రజాప్రాతినిధ్య సంస్థలో నామమాత్రంగా ఉండిపోతుంది. అక్కడ జరిగే వ్యవహారాలు, లావాదేవీలన్నింటినీ పురుషులే నిర్వ హిస్తుంటారు.
భర్త, సోదరుడు, కుమారుడు లేదా మామ పంచా యతీ కార్యాలయాల్లో రాజ్యమేలుతుండగా, ఎంపికైన మహిళలు తలలు ఊపుతూ కూర్చోవలసిన పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలను నేను చాలానే చూశాను. మహారాష్ట్రలో దశాబ్దాల క్రితం కొల్హాపూర్ జిల్లా పరిషత్‌లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రయోగం మొదలైన రోజుల్లో ఆ ప్రయోగాన్ని ఇలా వ ర్ణించేవారు. ధీద్ సదస్య. అంటే ఒకటిన్నర సభ్యులు అని అర్థం. దీంట్లో అర్థ భాగం ఎంపికైన మహిళ అన్నమాట. సాధికారతా సాధనంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల పట్ల సమాజం ప్రదర్శించిన పరమ పాక్షిక వైఖరిని ఇది సూచిస్తుంది. నగరాలు కాస్త ఉదారవైఖరితో ఉంటాయని భావిస్తాము కానీ ఈ వైఖరి తర్వాత్తర్వాత నగర పురపాలక సంస్థలకు కూడా విస్తరించింది.
బృహన్ ముంబయ్ ప్రాంతంలోని అతిపెద్ద నగరా ల్లో ఒకటైన కల్యాణ్ - దాంబివిలి మునిసిపల్ కార్పొరే షన్‌కు గతవారం జరిగిన ఎన్నికల్లో 50 శాతం మహిళలు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 50 శాతం కోటా గురించి ఆలోచిస్తున్నప్పటికీ అది అమలయ్యేంత వరకు వేచి ఉండని కొద్ది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది. కేరళ, క ర్ణాటక కూడా ఇదే బాట పట్టాయి.
కానీ కల్యాణ్ - దాంబివిలి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఒక వాస్తవాన్ని దాచిపెట్టాయి. కార్పొరేషన్‌కు ఎంపికైన 122 మంది సభ్యులలో సగం మంది మహిళలే. వీరిలో ఆరుగురు మహిళలు పలు రాజకీయ పార్టీలకు చెందిన సిట్టింగ్ కార్పొరేటర్ల భార్యలు కావటం గమనార్హం. ఇలా ఎందుకు జరిగిందంటే నగరం విస్తరించినందున వార్డులను పునర్నిర్మించడంతో ఇప్పటికే కార్పొరేటర్లుగా ఉన్న భర్తలకు తమ తరపున ఒక కార్పొరేటర్ ఉండవలసిన అవసరం ఏర్పడింది. గౌరవనీయులైన తమ భార్యల కంటే వారికి మంచివారు ఇక ఎవరు దొరుకుతారు?
ఏమైనప్పటికీ మహిళల సాధికారత కోసం వారికే కేటాయించిన సీట్ల కేటగిరీలో ఈ మహిళలు ఎంపికయ్యారు. దీంతో ఒక్కో వార్డు ఒక్కో కుటుంబ జాగీరు అయిపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఇతరుల్లో కూడా ఆ ఎన్నికల్లో పాల్గొనాలనే కుతూహలం పెరిగిపోయింది. మహిళా కోటా విధానం ప్రకారం మహిళలు బలోపేతం కావలసి ఉండగా, దానికి భిన్నంగా ఇప్పటికే అధికారంలో ఉన్న కార్పొరేటర్ కుటుంబానికి రాజకీయ పలుకుబడిని, శక్తిని ఈ విధానం కట్టబెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ వ్యాపార సంస్థలుగా ఆవిర్భవిస్తున్న కుటుంబాల సాధికారతను మరింతగా పెంచడానికి ఈ మహిళా కోటా మరింతగా ఉపయోగపడుతోంది.
మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com)