వైఫల్యం నేర్పిన విజయపాఠం | BJP's gains were wrested by humbly learning lessons from previous defeats, Anita Katyal writes | Sakshi
Sakshi News home page

వైఫల్యం నేర్పిన విజయపాఠం

Published Sat, May 21 2016 2:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP's gains were wrested by humbly learning lessons from previous defeats, Anita Katyal writes

గతంలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన ఘోర పరాజయం తర్వాత బీజేపీ వ్యూహకర్తలు వేగంగా పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నికల్లో విజయానికి మోదీపైనే ఆధారపడలేమని గ్రహించి, రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకునిపోవడమే బీజేపీకి అసోంలో అనూహ్య విజయాన్ని అందించింది.

 

ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతాపార్టీ చావుదెబ్బ తిని వెనుకంజ వేసిన నేపథ్యంలో ఈ గురువారం ప్రకటించిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యక్తిగత విజయానికి చక్కటి నిదర్శనంగా నిలి చాయి. అసోంలో బీజేపీ సాధించిన గణనీయ విజయంవల్ల,  పశ్చిమబెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా విస్తరిం చడంవల్ల పార్టీలో మోదీ-షా ద్వయం విశ్వసనీయత, అధికారం పున స్థాపితమయింది. ముఖ్యంగా, అత్యంత సంక్లిష్ట రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రగతిని సాధించే దిశగా ఈ ఫలితాలు ఇరు నేతల్లోను ఉత్సాహాన్ని నింపాయి.

 

ఢిల్లీ, బిహార్‌లో బీజేపీ ఘోర పరా జయం పొందడంతో మోదీ-షా ద్వయం నాయకత్వానికి ప్రమాదం ఏర్పడనప్పటికీ, ఆ రెండు రాష్ట్రాల్లో షా అమలుపర్చిన ఎన్నికల ప్రచార వ్యూహం గురించి పార్టీలో అంతర్గతంగా పలు ప్రశ్నలు తలెత్తాయి. పనితీరులో అమిత్ షా అనుసరించిన పరమ నియం తృత్వ శైలిపై పార్టీ సభ్యులు అంతర్గ తంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుడిగా షా మళ్లీ ఎన్నిక కావడం కూడా ప్రశ్నార్థకమైంది. పైగా చెదిరిపోతున్న మోదీ ఆకర్షణ, విజయ సాధనలో ఆయన సామర్థ్యంపై పుకార్లు చెలరేగాయి. ఈ గురువారం పార్టీ సాధించిన విజయంతో బీజేపీలో మోదీ-షా విమర్శకుల నోళ్లు మూతపడ్డాయనే చెప్పాలి.

 

గత తప్పిదాల నుంచి ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోని కాంగ్రె స్‌లా కాకుండా, ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరమైన ఓటమి తర్వాత బీజేపీ వ్యూహకర్తలు మళ్లీ మూలాల్లోకి వెళ్లి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు తాజా వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందడానికి మోదీపైనే ఎక్కువగా ఆధారపడలేమని, రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకోవడం అవసరమని పార్టీ గ్ర హించింది. అసోంలో ఎన్నికలు ప్రకటించడానికి ఎంతో ముందే సర్బానంద సోనో వాల్‌ని ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది. స్థానిక అంశా లపై ప్రధానంగా దృష్టి పెట్టే రాష్ట్ర స్థాయి నేతలను ప్రచారంలో భాగం చేసింది. బిహార్ ప్రచారంలో వలె కాకుండా, బీజేపీ కేంద్ర నాయకత్వం అసోంలో ప్రచారాన్ని బాగా తగ్గించుకుంది. ప్రచార రూపకల్పన, అమ లులో బయటి నుంచి జోక్యం దాదాపుగా లేకుండా పోయింది.

 

దీర్ఘకాలంగా ఉద్యమ నిర్మాణంలో తలపండిన అసోం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్‌లను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ వాటితో వ్యూహాత్మక పొత్తులను కుదుర్చుకుంది. పైగా, 15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన తరుణ్ గొగోయ్‌ను దాటుకుని అసోం ప్రజలు మార్పుకు సిద్ధం కావడం కూడా బీజేపీకి తోడ్పడిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో గొగోయ్ బద్ధశత్రువు హిమంత్ బిశ్వశర్మను ఆకర్షించి తనలోకి చేర్చుకోవ డంలో బీజేపీ అసాధారణ ప్రయత్నం చేసి నెగ్గింది కూడా.

 

కాంగ్రెస్‌తో లెక్కలు సరిచేయడమనే ఏకసూత్ర ఎజెండాతో ముందు కొచ్చిన శర్మ ఈ ఎన్నికల్లో బీజేపీ స్టార్ కేంపెయినర్‌గా, ప్రధాన వ్యూహ కర్తగా ఆవిర్భవించారు. అన్నిటికీ మించి, బోడో పీపుల్స్ ఫ్రంట్, ఏజీపీ లను చర్చలకు రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దుల నుంచి చొరబాటు వంటి అత్యంత సున్నిత సమస్యపై ప్రజల్లో బలపడు తున్న అసమ్మతిని మోదీ, షా, శర్మ చక్కగా వినియోగించుకోగలిగారు.

 ఆ వ్యూహం ఎంతగా ఫలించిందంటే ఈశాన్య భారత్‌కు ప్రవేశ ద్వారం వంటి అసోం వంటి కీలక రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభు త్వాన్ని ఏర్పర్చగలిగే స్థాయికి చేరుకుంది. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోకి బీజేపీ ప్రవేశించడం చాలా సులువైంది.

 

అసోంలో గెలుపుతోపాటు కేరళలో బీజేపీ తొలిసారి ఖాతా తెరవడం, పశ్చిమబెంగాల్‌లో తన ఓట్ల, సీట్ల శాతాన్ని మెరుగు పర్చుకోవడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఇంతవరకు చెప్పుకో దగిన ఉనికి లేదు. కాషాయ పార్టీ, దాని కూటమి కలిసి కేరళలో 15 శాతం ఓట్లు దండుకున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో తొలి బీజేపీ ఎమ్మెల్యేగా రాజ గోపాల్ అడుగుపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒకటి నుంచి 5 స్థానా లకు ఎగబాకగా, ఓట్ల శాతం 20 శాతానికి చేరడం దిగ్భ్రాంతి గొలిపే విషయం.

 

బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేదీ ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ‘బీజేపీ అన్ని రాష్ట్రాల్లో లబ్ధి పొందింది. పార్టీ భౌగోళిక, రాజకీయ విస్తరణను ఈ ఎన్నికలు ప్రతి బింబించాయి’. మరొక సీనియర్ నేత మాట్లాడుతూ హిందీ ప్రాంతంలో ప్రాబల్యమున్న పార్టీగానూ తమను ఇక పిలువలేరని దేశవ్యాప్తంగా పలుకుబడి కలిగిన, దేశంలోనే అతి ముఖ్యమైన శక్తిగా బీజేపీ అవతరిం చిందని పేర్కొన్నారు.

 

ప్రస్తుత ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తోడ్పడ నున్నాయి. పార్లమెంటులో తనదైన ఎజెండాను ముందుకు తీసుకు పోవడం బీజేపీకి ఇక నల్లేరుపై నడక కానుంది. ఇంతవరకు రాజ్యసభలో సంఖ్యాపరమైన ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ పాలక కూటమిని పదే పదే అడ్డుకుంటూ వచ్చింది. ఎగువసభలో ఇప్పటికీ కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా ఉంటున్నప్పటికీ తాజా పరాజయాలతో మోదీ ప్రభుత్వంతో బలంగా పోరాడే విశ్వసనీయతను అది కోల్పోయింది.

 

ప్రాంతీయ పార్టీలతో వ్యవహారం నడపటం కేంద్ర ప్రభుత్వానికి ఇక సులభం. ఏఐడీఎంకే, బిజు జనతాదళ్ ఇప్పటికే బీజేపీపట్ల స్పష్టంగానే మొగ్గు చూపాయి. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మరింత ఆత్మస్థైర్యంతో బీజేపీతో వ్యవహారాలు నడపగలదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలతో వ్యవహరించడానికే ప్రాధాన్యమిస్తూ వస్తోంది.. మా పార్టీని బలహీనపర్చాలనే దాని ప్రధాన లక్ష్యానికి ఇదే కారణం అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత సరిగ్గానే వ్యాఖ్యానించారు.

 

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదించిన బీజేపీ వ్యతి రేక ఫ్రంట్‌కు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలి నట్లే. ఈ కూటమిని నడిపించాలనుకున్న కాంగ్రెస్.. ఇతర పార్టీలు ఇకపై తనతో కూటమికి సిద్ధపడలేనంతగా దిగజారిపోనుంది. తమ తమ రాష్ట్ర స్థాయి అవసరాల రీత్యా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు కూడా భవిష్యత్తులో ఒక ఉమ్మడి వేదికలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడా లబ్ధి చేకూరేది బీజేపీకేనని చెప్పనవసరం లేదు.

 

- అనితా కత్యాల్, సీనియర్ జర్నలిస్టు

 scroll.in సౌజన్యంతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement