జగమెరిగిన వ్యూహకర్తకే మళ్లీ అందలం...!! | GCA to BJP national president | Sakshi
Sakshi News home page

జగమెరిగిన వ్యూహకర్తకే మళ్లీ అందలం...!!

Published Sun, Jan 31 2016 1:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

జగమెరిగిన వ్యూహకర్తకే మళ్లీ అందలం...!! - Sakshi

జగమెరిగిన వ్యూహకర్తకే మళ్లీ అందలం...!!

అవలోకనం
బీజేపీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు ప్రకటించాక, బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షా తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు రోజుకు 500 కిలోమీటర్ల చొప్పున దేశమంతా పర్యటిస్తూ పార్టీని నిర్మిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చారు. తన సొంత చొరవతో ఇలాంటి బృహత్తర పని బాధ్యతలు చేపట్టే వ్యక్తి కాంగ్రెస్‌లో ఉన్నారని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాని అమిత్‌షా తన పనిలో అత్యంత నిలకడతనంతో కొనసాగుతున్నారు.
 
అది 2009 సెప్టెంబర్ మాసం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధ్యక్ష పదవికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు అమిత్‌షా వెళుతున్నారు. కారులో ఆయనతోపాటు నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ప్రయాణిస్తున్నారు. జీసీఏ వద్దకు చేరుకుంటుండగా మోదీ ఉన్నట్లుండి మనసు మార్చుకున్నారు. షాతో ఇలా చెప్పారు: ‘నహిన్ యార్ హూంజ్ బను’ (ఈ పదవి నేను తీసుకోవాలనుకుంటున్నాను).
 అలా చివరిక్షణంలో మోదీ జీసీఏ అధ్యక్షుడైపోయారు. ఇక నిత్య విశ్వసనీయుడైన షా దీంతో పెద్దగా గుంజాటన పడలేదు. షా వంటి వ్యక్తి కాంగ్రెస్‌కు లేడు మరి. షా విశ్వసనీయుడు, సమర్థుడు కూడా. మోదీకి ఆయనపట్ల ఎంత విశ్వాసమంటే యావత్‌పార్టీపై తనకు సర్వస్వతంత్ర అధికారం ఇచ్చేశారు. రాజకీయంగా బీజేపీలో ఇప్పుడు నంబర్-2 ఎవరంటే అమిత్ షానే.

జనవరి 24న బీజేపీ అధ్యక్ష పదవికి అమిత్‌షా మరోసారి ఎన్నికయ్యారు. మరో మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఈ మూడేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు వంటి పలు కీలక మైన రాష్ట్రాలు ఎన్నికలకు సమాయత్తం కానుండగా, షా బీజేపీకి అధ్యక్ష బాధ్యతలు వహించనున్నారు. దాదాపుగా ఈ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో దళితనేత కాన్షీరాం పేర్కొ న్నట్లుగా, ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ పురోగతి చెందుతుంది, విస్తరిస్తుంది కూడా. షాకు, బీజేపీకి ఎన్నికల పరంగా 2016 ఒక మంచి వార్తనే అందిస్తుందన్నది నా అభిప్రాయం.

బీజేపీకీ 2015 అలాంటి మంచి సంవత్సరం కాలేదని మీడియా అభిప్రాయం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని తుడిచిపెట్టేసింది. ఇక బిహార్‌లో జనతాదళ్ చేతిలో అనూహ్యంగా భారీ మెజారిటీతో ఓడిపోయింది. ఇది షా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉన్నా, దాన్ని బయటకు ప్రదర్శించలేదు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటు బ్యాంకును షా చెక్కు చెదరకుండా నిలిపారు. అరవింద్ కేజ్రీవాల్ అసాధారణ వ్యక్తిత్వం ముందు, మనకాలపు చురుకైన రాజకీయనేత మోదీతో కలసి అమిత్‌షా ఢిల్లీలో ఓడి పోయారు. ఇక బిహార్ విషయానికి వస్తే షాను ఓడించడానికి ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలసి పోరాడాల్సి వచ్చింది. చివరకు గుజరాత్‌లో కూడా, రిజర్వేషన్లపై పాటిదార్ కమ్యూనిటీ తిరుగుబాటు ద్వారా తనకు మంచి ఫలితాలు వస్తాయని ఆశించినప్పటికీ భారత్‌లోనే అత్యంత నగరీకరణ సాధించిన గుజరాత్‌లో ప్రతి ప్రధాన నగరంలోనూ బీజేపీయే పట్టు సాధించింది. అక్కడ ఇప్పటికీ బీజేపీకే అనుకూలత ఉంది.

దీనికి కారణాల్లో అమిత్‌షా సమర్థత కూడా ఒకటి. షా అత్యంత సమర్థత కలిగిన కార్యదక్షుడు. క్షేత్రస్థాయి కార్యకర్త చుట్టూనే ఆయన తన వ్యూహాలను నిర్మించుకుంటారు. క్షేత్రస్థాయిలో ఆడిన అద్భుతమైన ఆట వల్లే బరాక్ ఒబామా 2008 నాటి డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి క్యాంపెయిన్‌లో విజయం సాధించారని విశ్లేషకులు చెప్పారు. అభ్యర్థి మేధోతనం కంటే అవలంబించిన వ్యూహరచన, చేపట్టిన కార్యక్రమాల చురుకుతనాన్నే ఇది ప్రధానంగా చూపిస్తుంది. అది కఠిన శ్రమ, ప్రణాళికల కలబోత.  ఈ అంశంలో షా అతి సమర్థుడు. వ్యాపార రీత్యా ఆయనది జైన నేపథ్యం. భారీకాయం, సానుకూలమైన చూపులతో కనిపించే షా... గుజరాతీ తరహా మధ్యతరగతికి చెందిన హిందుత్వవాది. మోదీలాగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ తరహా వ్యక్తి కాదాయన. అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన ఏ వ్యక్తిని చూసినా కనిపించే అదే అంకితభావంతో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. పైగా తనకున్న వ్యాపార నేపథ్యం.. విషయాలను స్పష్టతతోనూ, ఆచరణాత్మక దృష్టితోనూ చూడగల అనుకూలతను ఆయనకు కట్టబెట్టింది.

బీజేపీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు ప్రకటించాక, బాధ్యతలు స్వీకరించిన అమిత్‌షా తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు రోజుకు 500 కిలోమీటర్ల చొప్పున దేశమంతా పర్యటిస్తూ పార్టీని నిర్మిస్తూ, బలోపేతం చేస్తూ వచ్చారు. తన సొంత చొరవతో ఇలాంటి బృహత్తర పని బాధ్యతలు చేపట్టే వ్యక్తి కాంగ్రెస్‌లో ఉన్నారని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కాని అమిత్‌షా తన పనిలో అత్యంత నిలకడతనంతో కొనసాగుతున్నారు.
 కొన్ని నెలల క్రితం నేను అహ్మదాబాద్‌లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యంగా భారీ కేంపెయన్ జరుగుతుండటం గమనించాను. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు లేనప్పటికీ మిస్‌డ్ కాల్స్ ద్వారా పార్టీ సానుభూతిపరుల డేటా బేస్‌ను సేకరించే పనిలో అమిత్‌షా మునిగిపోవడం గమనించాను.

దాదాపు 11 ఏళ్లపాటు నేను అహ్మదాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు అమిత్ షాతో తరచుగా సంప్రదింపుల్లో ఉండే అవకాశం వచ్చింది. మీడియా అంటేనే అవిశ్వాసంతో చిరచిరలాడే వ్యక్తిత్వం ఆయనది. ఆయనను ఎప్పుడు కావా లంటే అప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి సాధించగల ఒకే ఒక జర్నలిస్టు ఎవరంటే, రెడిఫ్.కామ్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన షీలా భట్. జగడాలమారితనంతో అయినప్పటికీ అత్యంత సహనంతో షాతో ఆమె చేసే ఇంటర్వూ ్యలు పాఠకలోకాన్ని వెలిగించేవి. ఆమె గుజరాతీలో మాట్లాడేవారు కాబట్టే ఆమెకు మాత్రమే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అనుమతించే వారని నా అనుమానం. షాను అత్యంత సానుకూలంగా, సుఖంగా ఉంచే భాష గుజరాతీయే మరి.

షా పార్టీ బాధ్యతలను దృఢంగా నిర్వహిస్తుండటంతో, ఎల్‌కే అద్వానీ వంటి అసమ్మతివాదులు ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మోదీకి తన ఎన్నికల వ్యూహాన్ని రూపకల్పన చేయడం, ఆచరణలో పెట్టడం అమిత్‌షా వల్లే సాధ్యమైంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం సమర్థవంతమైందీ, అర్థవంతమైనది కూడా. అద్వానీ, వాజ్‌పేయీ మాదిరిగా కాకుండా, ఇప్పుడు బీజేపీలో నంబర్ వన్ ఎవరనే విషయంలో అత్యంత స్పష్టత ఏర్పడింది. రాజ్యసభలో మోదీకి మెజారిటీ సాధించిపెట్టేందుకు 2016లో జరగనున్న భారీ ఎన్నికలను అమిత్‌షా ఎలా ఎదుర్కుంటారన్నది ఉత్కంఠభరితమైన విషయం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కథను వల్లించడం ద్వారా నేను ఈ కథనం మొదలెట్టాను. దాంతోనే ముగిస్తాను. ఆనాడు కారులో ప్రయాణిస్తూ జీసీఏ అధ్యక్ష పదవిపై ఆకాంక్షను వెలిబుచ్చిన మోదీ అయిదేళ్ల తర్వాత అంటే 2014లో భారత ప్రధాని అయ్యారు. వెంటనే జీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చారు. మరి ఇప్పుడు జీసీఏ కొత్త అధ్యక్షుడెవరంటారా? ఇంకెవరు? అమిత్ షాయే.

ఆకార్ పటేల్,
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement