భావనా స్వేచ్ఛకు కొత్త సంకెళ్లు | New Manacles to Conceptual freedom | Sakshi
Sakshi News home page

భావనా స్వేచ్ఛకు కొత్త సంకెళ్లు

Published Tue, Jul 14 2015 12:38 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

భావనా స్వేచ్ఛకు కొత్త సంకెళ్లు - Sakshi

ఇంతకూ అసలు విషయం - పెక్కు మంది పాలకులు ఉన్నత పదవుల్లో ఉంటూనే పెక్కు రకాల అవినీతికి పాల్పడుతున్నప్పటికీ అలాంటి వారిని విచారించి, శిక్షించాల్సింది పోయి పదవులలోనే మొండిగా కొనసాగే అవకాశం కల్పించడం  జరుగుతోంది. ఏది ‘పరువునష్టమో’ వివరించుకోవలసిన చోట, సమర్థనీయమైన ఆరోపణలను కూడా డిఫమేషన్ కింద బలంగా తోసిపుచ్చడానికి ఒక విశ్వ ప్రయత్నం జరుగుతున్న దశలో మనం ఉన్నాం!  
 
 ‘పరువునష్టం’ పేరుతో, దానికి (డిఫమేషన్) సంబంధించిన కేసులను సివిల్ చట్టం కింద కాకుండా, క్రిమినల్ చట్టం కిందనే పరిగణించి సమర్థించా లని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’    
 - డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి
 (భారతీయ జనతా పార్టీ నాయకులు: కేంద్రానికి జూలై 9న  రాసిన లేఖ)
 
 న్యాయం తప్పేవాడికి ఆచార్యుడి బోధలు కానీ కటాక్షం కానీ అనవ సరం! సుబ్రహ్మణ్యస్వామి ఇతర అభిప్రాయాలతో ఏకీభవించినా, లేకపో యినా ‘పరువునష్టం’ కేసుల విషయంలో బీజేపీ ప్రభుత్వం తాజా ఆలోచ నలనూ, వైఖరినీ ఆయన లేఖాంశాల ద్వారా గ్రహించాలి. ఆయన ప్రకటనను దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకూ, దాని రక్షణకూ రాబోతున్న ప్రమాదం గురించిన ముందస్తు హెచ్చరికగా పరిగణించవచ్చు. ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని ఒక్క కలం పోటుతో తోసిరాజన్న అత్యవసర పరిస్థితి (ఎమ ర్జెన్సీ) చీకటిరోజులను జ్ఞప్తికి తెచ్చుకుని నెల కూడా గడవలేదు! ఆ బాధలు అనుభవించిన బీజేపీ నాయకులకు ఆనాడు జైళ్లలోనూ, బయటా పొందిన మానసిక ‘గాయాల సలపరమూ’ గుర్తుండే ఉండాలి! అయినా సరే, సంపన్న వర్గాల ప్రయోజనాల రక్షణకు కంకణం కట్టుకున్న ధనికవర్గ పాలకపక్షా లన్నింటి తీరుతెన్నులూ ఒకటిగానే ఉంటాయి. బీజేపీ విషయంలోనూ అదే జరుగుతోందనడానికి తాజా ఉదాహరణ - ‘పరువునష్టం’ కేసుల మెలిక.
 
 క్రిమినల్ చట్టం కింద కు వస్తాయా?
 పరువునష్టం కేసులన్నింటినీ సాధారణ పౌరన్యాయ చట్టం పరిధిలోకి తీసుకు రాగలిగిన పరిస్థితులు నేడు లేవని కేంద్ర హోంశాఖ భావిస్తోంది! కాబట్టి ఇక మీదట ‘పరువునష్టం’ కేసులు క్రిమినల్ నేరచట్టం కిందనే శిక్షార్హమైనవిగా (పీనల్ అఫెన్స్) ఉండాలని ఇంటర్నెట్‌లో ముమ్మరిస్తున్న వార్తలను, అభిప్రా యాలను, వ్యాఖ్యానాలను ప్రస్తావించిన పూర్వరంగంలో హోంశాఖ సుప్రీం కోర్టుకు ఆదివారం విన్నవించుకుంది! ‘పరువునష్టం’ సందర్భాలను క్రిమినల్ డిఫమేషన్‌గా పరిగణించటం వల్ల భావప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర ఆటంకమన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఒకరి పరువునష్టానికి కారకుడైన వ్యక్తి తగిన పరిహారాన్ని సాధారణ పౌరచట్టం కింద చెల్లించగల స్తోమత గల వాడు కాకపోవచ్చు, కాబట్టి పరువునష్టాన్ని శిక్షార్హమైన క్రిమినల్ అఫెన్స్‌గానే కొనసాగాలని హోంశాఖ కోర్టుకి తెలిపింది. ఇప్పుడు ఆన్‌లైన్ (నెట్)లో సాగుతున్న ‘పరువునష్టం’ సమాచారాన్ని తగు విధంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తడబడకుండా స్పష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయాన్ని ఏం సూచించింది? డిఫమేషన్‌ను కేవలం ‘క్రిమి నల్ అఫెన్స్’గా ప్రకటించి కూర్చోమని సలహా ఇస్తోంది!
 
 ‘క్రిమినల్ డిఫమేషన్’ (పరువునష్టాన్ని శిక్షార్హమైన నేరం)గా ప్రకటించ డాన్ని రాజ్యాంగ విరుద్ధమైన అంశంగా పరిగణించాలని కోరుతూ పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు దాఖలు చేసిన రిట్ దరఖాస్తు లకు సమాధానంగా ప్రభుత్వం తన అఫిడవిట్‌ను కోర్టులో దాఖలు చేసింది! ఈ రిట్‌పై సంతకాలు చేసిన ప్రముఖులలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు కూడా ఉన్నారు! ప్రధాన రిట్ దరఖాస్తుదారుడైన సుబ్రహ్మణ్యస్వామి ‘పరువునష్టం’ కలిగిందన్న మిషపైన ఆ అభియోగాన్ని నేరమయ చర్యగా క్రిమినల్ డిఫమేషన్ కింద పరిగణిం చడం వ్యక్తుల భావ ప్రకటనా స్వేచ్ఛను ఆటంకపరచడమే గాక అధికార దుర్వినియోగమూ, ప్రభుత్వాధికారుల చర్యలను విమర్శించే పౌరుల హక్కు ను అణచివేయడమే అవుతుందని స్పష్టం చేశారు!
 
 ఎందుకంటే ‘పీనల్ అఫెన్స్’ పేరిట ఇది పౌరుల భావప్రకటనపై ప్రత్యక్ష దాడే గాకుండా విమర్శ కుల్ని రెండేళ్లు జైల్లో నిర్బంధించడానికి అవకాశమిస్తోంది! అయితే, ఇంతకూ అసలు విషయం - పెక్కుమంది పాలకులు ఉన్నత పదవుల్లో ఉంటూనే పెక్కు రకాల అవినీతికి పాల్పడుతున్నందున, అలాంటి వారిని విచారించి, శిక్షించాల్సింది పోయి పదవులలోనే మొండిగా కొనసాగించడం జరుగు తోంది. ఏది ‘పరువునష్టమో’ వివరించుకోవలసిన చోట, సమర్థనీయమైన ఆరోపణలను కూడా డిఫమేషన్ కింద బలంగా తోసిపుచ్చడానికి ఒక విశ్వ ప్రయత్నం జరుగుతున్న దశలో మనం ఉన్నాం!
 
 అద్వానీ హెచ్చరిక నిజమౌతుందా?
 బీజేపీ అగ్రనేతలలో ఒకరైన అద్వానీ ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తూ మరొక సారి దేశంలో ఆత్యయిక పరిస్థితి ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదని చేసిన హెచ్చరికను సుప్రీంకోర్టులో హోంశాఖ చేసిన తాజా ప్రకటన ధ్రువపరు స్తోందా? నిజానికి ప్రజాబాహుళ్యం మౌలికమైన ప్రయోజనాలను, అవసరా లను ఆదుకోవడానికి డిఫమేషన్ అడ్డురాదు! ఆలోచనలు, చేతలూ పాలకులు ప్రజాస్వామ్యానికి ఎంత సన్నిహితంగా ఉన్నారో, ఏ మేరకు ప్రజాహితైషు లుగా ఉన్నారో రుజువు పరచాలి గాని, కేవలం డిఫమేషన్స్ వల్ల పరువు ప్రతి ష్టలు పోవని గుర్తించాలి! అందుకనే పెక్కు దేశాలలో ‘డిఫమేషన్’ భావన కేవ లం పౌర పరిహారంగానే (సివిల్ లయబిలిటీ) అమలు జరుగుతోంది.
 
 అమెరికాలోనూ అలాగే ఉంది. పైగా, సాంకేతిక పరిజ్ఞానం, దాని అనువర్తిత శాఖ లూ జాంబవంతుని అంగలా రోజుకొక తీరున విస్తృతమవుతూ, ఉధృతమ వుతూన్న ఈ రోజుల్లో డిఫమేషన్ అంశాల్ని క్రిమినల్ నేరంగా, శిక్షార్హమైనదిగా ఇక పరిగణించకుండా కేవలం సివిల్ డిఫమేషన్‌గానే పరిగణించడం ధర్మ మని, భారత నేర, శిక్షాస్మృతిలోని 499-500 ఉత్తరోత్తరా సవరించవలసిన అవసరం రావొచ్చునని - 1994లో ఒక తమిళనాడు పత్రికపై నమోదైన క్రిమి నల్ డిఫమేషన్ కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ జీవన్‌రెడ్డి బెంచి) స్పష్టం చేసింది!
 
 అందువల్ల, చేసిన తప్పిదాలను, నేరాలను కప్పిపుచ్చుకోడానికి రాజకీయ నాయకులుగానీ, పాలకశక్తులుగానీ అనేక సందర్భాలలో ‘ఏకాంతం’ పేరిట, గుట్టుమట్టుల పేరిట, పరువునష్టాల పేరిట ప్రజాక్షేమ ప్రయోజనాలకు విరు ద్ధంగా పళ్ల బిగువు కోసం కేసులు వేస్తూండటం ప్రజలకూ, పత్రికా లోకానికీ ప్రత్యక్షానుభవమే! నా పాత్రికేయ జీవితంలో నేను పని చేస్తున్న పత్రికపైన / నాపైనా దాదాపు 60కి పైగా ఈ డిఫమేషన్ కేసులు పడ్డాయి, కానీ ఒక్క కేసు కూడా నిలవలేదు.
 
 ఎందుకంటే జస్టిస్ జయచంద్రారెడ్డి ఒక తీర్పులో చెప్పిన ట్టుగా ‘తనకు తెలిసిన సమాచారం వార్తల రూపంలో అందించడం, దానిపైన ఖండనమండనలు వస్తే వాటిని ప్రచురించటం తప్ప పత్రికల వారికి గాని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి గాని మరో మార్గం లేదు గదా!’ ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామి ప్రభృతులు లేవనెత్తిన సమస్యను (డిఫమేషన్‌ను క్రిమినల్ అఫెన్స్ కింద పరిగణించరాదని, సివిల్ దావా కిందనే ఉంచాలనీ) 2003లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్ నం:13568)ను సుప్రీంలో దాఖలు చేశాను. కోర్టు దాన్ని అనుమతించినా కూడా దురదృష్ట వశాత్తు గత 12 ఏళ్లుగా విచారణకు ఇంకా రాలేదు! క్వీన్స్ కౌన్సిల్ (బ్రిటన్) సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ ఈ డిఫమేషన్ కేసులు తన బెంచ్‌కి వచ్చినప్పుడు ‘ఈ ధర్మాసనం మీద మనం కూర్చున్నది న్యాయమూ ర్తులు తమకు అనుకూలంగా తీర్పులు చెప్పుకోడానికి కాద’ని సహ జడ్జీలకు గుర్తు చేయవలసివచ్చింది. ఇప్పుడు అలాంటి చరిత్రనే మన సుప్రీంకోర్టు కూడా ఇటీవలి కాలంలో ‘2జీ’ కుంభకోణాలపై తీర్పులతో ప్రారంభించి ముందుకు సాహసంతో సాగుతోంది.
 
 దేశంలో ఇంటర్నెట్‌లో వచ్చే సమాచారాన్ని పాలక వర్గాలకు అనుకూ లంగా నియంత్రించే యత్నంలో భాగంగా ‘నెట్ తటస్థంగా ఉండిపోవాల’న్న శాసనం విన్నవిస్తూ వచ్చింది. అంటే విమర్శనాయుత సమాచారం నెట్‌లో బట్వాడా కావడానికి వీల్లేదన్నమాట! దేశ ప్రయోజనాలకు హానికరమైన నిర్ణయాల విషయంలో సహితం తాటస్థ్యం వహించినప్పుడు ‘తాటస్థ్యం’ విద్రోహకర పాత్రగా నమోదవుతుంది! అందుకే ప్రపంచ సామ్రాజ్యవాద దురాక్రమణశక్తిగా అవతరించిన అమెరికా పాలకవర్గాలు కూడా ‘భావ ప్రక టనా స్వాతంత్య్రం, పత్రికాస్వేచ్ఛలకు’ హామీ పడుతూ దీన్ని కుదించే చట్టాన్ని పార్లమెంటు చేయబోదన్న హామీని మార్చడానికి సాహసించలేదు! సుప్రసిద్ధ న్యాయమూర్తులు జస్టిస్ బ్రాండీస్, జస్టిస్ హోమ్స్ ఒక తీర్పులో ‘‘రాజకీయంగా తమకు తీవ్రమైన దెబ్బ తగల నున్నదన్న భయంతో పాల కులు భావప్రకటనా స్వేచ్ఛను ఎదుటివారి సమావేశ స్వేచ్ఛను అణచివేయ డం అనేది ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మాంత్రికులు / మంత్రగత్తె లను చూసి కొందరు మనుషులు భీతిల్లిపోయి స్త్రీలను చంపేస్తుంటారు.
 
కానీ హేతు విరుద్ధమైన, పనికిమాలిన భయాలలో చిక్కుబడిపోయిన వారిని విముక్తి చేయడం అన్నది భావస్వేచ్ఛ విధి! ఆ స్వేచ్ఛను అణచివేయకపోతే దేశానికి వచ్చిపడే ప్రమాదం అత్యంత తీవ్రమైనదని నమ్మడానికి సహేతు కమైన కారణం ఉండి తీరాలి’’ అన్నాడు (‘విట్నీ వర్సెస్ కాలిఫోర్నియా’ కేసు)! నేడు ఒడిదుడుకుల సముద్రంలో ప్రయాణి స్తున్న బీజేపీ నావ అనేక కుంభకోణాల మధ్య దేశానికి, దేశ పౌరుల ప్రయోజనాలకు రాజ్యాంగానికి హానికరమైన నిర్ణయాలు చేసి, ఆ రీత్యా మిగిలిన తన పరువుప్రతిష్టలను కోల్పోదని ఆశిద్దాం!
 (వ్యాసకర్త మొబైల్: 98483 18414)
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement