విశిష్టమైన అమెరికన్ నవలాకారుడు
పరామర్శ
తన పఠనానుభవం గురించి మై రీడింగ్ లైఫ్ రాసాడు ప్యాట్ కాన్రాయ్. అందులో వార్ అండ్ పీస్ మీద రాసిన వ్యాసం అద్భుతంగా ఉంటుంది. యుద్ధానికి సంబంధించిన అన్ని అంశాలను టాల్‌స్టాయ్ చెప్పినట్టు ఏ ఇతర రచయితా చెప్పలేడని అంటూ, హిట్లర్ గాని, లిండన్ జాన్సన్ గాని, జార్జి బుష్ గాని ఈ నవల చదివివుంటే రెండవ ప్రపంచ యుద్ధం, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు జరిగివుండేవి కావంటాడు.
చండశాసనులైన తండ్రులు ఒకప్పటి తరాల్లో సర్వ సాధారణం. నేను స్కూల్లో చదివే రోజుల్లో తాడుతో, బెల్టుతో, కర్రతో, పేనిన కరెంటు వైరుతో కొడుకుల్ని దండించే తండ్రుల గురించి వినటం, కొన్నిసార్లు చూడటం జరిగేది. అదృష్టవశాత్తు ఇప్పుడటువంటి పరిస్థితులు లేవనుకుంటాను. ఐతే, అలాంటి ఒక తండ్రిని ప్రధాన పాత్రగా చేసి, 1975లో రాసిన తన మొదటి నవల The Great Santiniతో ప్రసిద్ధి పొందిన అమెరికన్ నవలాకారుడు ప్యాట్ కాన్రాయ్. అమెరికన్ మిలటరీలో ఫైటర్ పైలట్ గా పనిచేసే బుల్ మీఛం వృత్తికీ, కుటుంబానికీ సంబంధించిన కథ ఇందులో ప్రధాన ఇతివృత్తం. మిలటరీ డిసిప్లిన్ పేరుతో అతను పిల్లల్ని రకరకాలుగా బాధిస్తూ ఉంటాడు. ఈ Great Santini ఎవరో కాదు, కాన్రాయ్ తండ్రే. దీని వల్ల తండ్రి కొంతకాలం కాన్రాయ్‌తో మాట్లాడటం మానేస్తాడు. తరవాత రాజీ పడతాడు. కొడుకు బుక్ సైన్ చేసే సందర్భాల్లో వెళ్లి పక్కన కూర్చునేవాడు. కాన్రాయ్ సంతకం చేసాక, తను కూడా సంతకం చేసి, My son is a great writer of fiction అని రాసి, అందులో fiction అనే పదాన్ని నాలుగైదు సార్లు అండర్ లైన్ చేసేవాడట!
తండ్రి అతనిని క్షమించినా, అతను తండ్రిని క్షమించాడా అన్నది అనుమానమే. ఎందుకంటే, తన అనుభవాలను గురించి చెప్పేటప్పుడు అనేకసార్లు తండ్రి ప్రస్తావన వస్తుంది. కాన్రాయ్ మరొక ప్రసిద్ధ నవల Prince of Tidesలోనూ మళ్ళీ ఇటువంటి తండ్రి పాత్ర కనిపిస్తుంది.
గృహహింసనే కాదు, నిస్సహాయుల మీద జరిగే ఏ హింసనైనా కాన్రాయ్ వ్యతిరేకిస్తాడు. డిగ్రీ చార్లస్టన్ నగరంలో ఉన్న సిటాడెల్ మిలటరీ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడి అనుభవాల గురించి The Lords of Discipline నవల రాసాడు. ఆ కాలేజీలో ప్లెబిసిస్టం అనే సంప్రదాయం ఉంటుంది. దాని ప్రకారం, మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థుల్ని రాటుదేలేలా చేసి, మిలటరీ జీవితానికి వారిని సిద్ధం చేసే బాధ్యత సీనియర్ విద్యార్థులది. ఆ మిషతో వాళ్ళు మొదటి తరగతి విద్యార్థుల్ని రకరకాలుగా వేధిస్తారు. వాళ్ళు పెట్టే చిత్రహింసలు, వాళ్ళాడే దుర్భాషలు వర్ణనాతీతం. వాటిని భరించలేక సగం మంది విద్యార్థులు రెండు మూడు వారాల్లోనే ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ నవల రాసినందుకు ఆ కాలేజీ వాళ్ళు కోపగించి, చాలా కాలం పాటు కాన్రాయ్‌ని బాయ్‌కాట్ చేస్తారు. తరువాత రాజీపడి, 2001లో జరిగిన స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చెయ్యమని ఆహ్వానిస్తారు.
ఐరిష్ కేథలిక్ కుటుంబంలో జన్మించిన కాన్రాయ్ పెంపకం మతవిశ్వాసాల కనుగుణంగానే జరుగుతుంది. హైస్కూలు వరకు కేథలిక్ స్కూల్లోనే చదువుకుంటాడు. ఆయన నివసించిన (ప్రస్తుతం నేనున్న) సౌత్ కరోలీనా రాష్ట్రం మతవిశ్వాసాలకి ఆటపట్టు. ఐనప్పటికీ, తన రచనల్లో అక్కడక్కడా మతాన్ని అవహేళన చెయ్యటం, మతాచార్యుల వల్ల జరిగిన అన్యాయాల్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. Prince of Tidesనవలలో కథా నాయకుడి తాతగారి పాత్ర , South of Broad నవలలో అమాయకులైన బాలుర్ని తన లైంగిక అవసరాలకు వాడుకునే చర్చిఫాదర్ పాత్ర ఉదాహరణలు.
కాన్రాయ్ వ్యక్తిత్వానికి ప్రతీకగా అతని గురుభక్తిని గురించి చెప్పుకోవచ్చు. తనలో ప్రతిభను గుర్తించి, రచయితగా మారటానికి దోహదపడిన హైస్కూలు ఇంగ్లిష్ టీచరు జీన్ నోరిస్‌ను జీవితాంతం తలుచుకుంటాడు. పది సంవత్సరాలపాటు ప్రతిరోజూ ఆయనతో ఫోనులో మాట్లాడేవాడట. చివరకు ఆయన కేన్సర్ వ్యాధితో మరణిస్తే, తన జీవితంలో అత్యంత విలువైన వ్యక్తిని కోల్పోయానని దుఃఖిస్తాడు. ఆయన ప్రభావం వల్లనే కావచ్చు కాలేజీ చదువు ముగిసాక, కాన్రాయ్ తను చదివిన హైస్కూలులోనే ఇంగ్లిష్ టీచరుగా చేరతాడు. అవి, నల్లజాతి విద్యార్థుల్ని తెల్లవారి స్కూళ్ళలో కొత్తగా అనుమతిస్తున్న రోజులు. కాన్రాయ్ ఉదార భావాలవల్ల నల్లవారి పట్ల అధిక శ్రద్ధను కనబరుస్తున్నాడని రెండేళ్ళలోనే అతనిని ఉద్యోగంలోంచి తొలగిస్తారు. అప్పట్లో కొంతకాలం తమ ఊరిలో నదికి ఆవలివైపునున్న నల్లవారి కాలనీకి పడవలో వెళ్లి పాఠాలు చెబుతాడు. ఆ అనుభవాలను Water is Wide పుస్తకంగా రాశాడు. ఆ తరువాత ఇంకెక్కడా ఉద్యోగం చెయ్యడు. పూర్తికాలం రచయితగా మారి జీవితాంతం అలాగే కొనసాగాడు.
కాన్రాయ్ స్నేహశీలి. అట్లాంటాలో నివసించిన రోజుల్లో పరిచయమేర్పడిన బుక్ షాప్ యజమానితో 30 సంవత్సరాలు స్నేహం కొనసాగిస్తూ అతని దగ్గర దాదాపు 4, 5 వేల పుస్తకాలు కొంటాడు. అంతకుమించి, తనకు కాలేజీలో ప్రియమిత్రుడు, గే అయిన టింబెల్క్ ఎనభైల చివర్లో ఎయిడ్స్ బారిన పడి శాన్ ఫ్రాన్సిస్కోలో నిస్సహాయంగా ఉన్నప్పుడు, తన కుటుంబాన్ని అక్కడికి తరలించి నాలుగు సంవత్సరాలు అతనికి దగ్గరగా గడుపుతాడు. అక్కడి పరిస్థితుల గురించి వివరంగా తన జ్ఞాపకాల్లో రాస్తాడు. ఎయిడ్స్ వ్యాధి ప్రారంభ దినాల్లో అన్ని వందలమంది అంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించారని నాకది చదివినంత వరకూ తెలియదు. టిమ్‌ను పోలిన పాత్ర, అతని అనుభవాలను పోలిన సన్నివేశాలు South of Broad నవలలో ఉంటాయి.
కాన్రాయ్ నవలల్లో ఇతివృత్తం ఎక్కువగా తన జీవితంలో జరిగిన సంఘటనల మీద ఆధారపడి వుంటుంది. అతని కిష్టమైన చార్లస్టన్ నగరం దాదాపు అన్ని నవలల్లోనూ వస్తుంది. వ్యాఖ్యల్లో, సంభాషణల్లో అంతటా వ్యంగ్య వైభవం నిండి వుంటుంది.
‘ఉన్మత్త భావశాలి’ అన్న పేరు కాన్రాయ్‌కి బాగా సరిపోతుంది. టీచర్, మిత్రుడు, పుస్తకం, రచన, మ్యూజిక్, ప్రదేశం – ఇలా దేని గురించి రాసినా శైలిలో ఒక రకమైన భావోన్మత్తత కనిపిస్తుంది. తన పఠనానుభవం గురించి My Reading Life రాశాడు. అందులో ప్రపంచ నవలా సాహిత్యంలో తాను అత్యుత్తమమైనదిగా భావించే గ్చిట War and Peace మీద రాసిన వ్యాసం అద్భుతంగా ఉంటుంది. యుద్ధానికి సంబంధించిన అన్ని అంశాలను టాల్‌స్టాయ్ చెప్పినట్టు ఏ ఇతర రచయితా చెప్పలేడని అంటూ, హిట్లర్ గాని, లిండన్ జాన్సన్ గాని, జార్జి బుష్ గాని ఈ నవల చదివివుంటే రెండవ ప్రపంచ యుద్ధం, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు జరిగివుండేవి కావంటాడు. ఇందులోని Why I write వ్యాసం రచయితలందరూ చదవదగినది. తను రాసేటప్పుడు డిక్షన్రీలు, థెసారేస్‌లు బృందగానం చేస్తాయనీ, తను రాసిన ప్రతి పదం నుంచి మకరందం గ్రోలతాననీ చెప్పినప్పుడు భాష పట్ల అతనికున్న మోహం అర్థమౌతుంది. దానికి తగ్గట్టుగానే అతని శైలి ఎంతో పొయెటిక్‌గా ఉంటుంది.
కవిత్వం మీద విపరీతమైన అభిమానం. మొదట్లో కవిత్వం రాసేవాడటగాని, తన కవిత్వం వల్ల భాషకి minor damage కలుగుతోందని గ్రహించి, ఆ ప్రయత్నం మానుకుంటాడు. కాని, ప్రతిరోజూ రాసే ముందర తనకిష్టమైన కవి కవితల్ని కొన్ని చదివాకే పని మొదలు పెట్టేవాడట.
కాన్రాయ్ మంచి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. కాలేజీలో ఉండగా ఆడిన ఒక సీజన్ గురించి రాసిన My Loosing Season నవల జనాదరణ పొందింది. వంటలోనూ మంచి ప్రవేశం ఉన్నవాడు. The Pat Conroy Cook Book: Recipes of My Life రాశాడు.
గత సంవత్సరం కాన్రాయ్ మరణించాక, అతను ఎక్కువకాలం నివసించిన బ్యూఫర్ట్ పట్టణంలో ఆయన పేర ఒక లిటరరీ సెంటర్ ప్రారంభించారు. అందులో ఆయన వాడిన వస్తువులు, ఫొటోలు, ఉత్తరాలు, పుస్తకాలు వంటివి భద్రపరిచారు. కాన్రాయ్‌కి పాఠకుల నుంచి గొప్ప ఆదరణ ఉంది, అతని నవలలనేకం సినిమాలుగా రూపొందాయి. అయినా గాని చెప్పుకోదగ్గ అవార్డులేవీ రాలేదు. అక్కడ కలిసిన కాన్రాయ్ మిత్రుడొకర్ని ఈ విషయం అడిగితే, దానికాయన చెప్పిన కారణాల్లో అతను దక్షిణాదికి చెందిన ఒక మారుమూల ప్రాంతంవాడు కావటం కూడా ఒకటి. మనదేశంలో లాగానే ఇక్కడా దక్షిణాది వారికి ఉత్తరాదివారు తమను చిన్నచూపు చూస్తారనే భావన వుంది. వీరి న్యూనతా భావానికి అంతర్యుద్ధంలో ఓడిపోయిన చరిత్ర ఒక కారణం కావచ్చుగాని, మన దగ్గర కారణమేమై ఉంటుందో.
రచయితగా, వ్యక్తిగా ఒక పరిపూర్ణమైన, ప్రయోజనకరమైన జీవితం గడిపిన ధన్యజీవి ప్యాట్ కాన్రాయ్.
విన్నకోట రవిశంకర్
rvinnako@yahoo.com