ఉత్తముల స్వభావం మహోన్నతం | selfless persons only have good Characterr | Sakshi
Sakshi News home page

ఉత్తముల స్వభావం మహోన్నతం

Published Fri, Feb 14 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

ఉత్తముల స్వభావం మహోన్నతం

ఉత్తముల స్వభావం మహోన్నతం

స్వార్థచింతన లేని స్వభావం కలవారే ఉత్తములు. వారు లోకహితాన్నీ, సర్వప్రాణి క్షేమాన్నీ కోరుకుం టారు. శ్రీరామచంద్రుని స్వభావమే ఇం దుకు తార్కాణం. శ్రీరామచంద్రుడు రావణుని వధించిన తర్వాత పుష్పక విమానంలో సపరివారంగా అయోధ్యకు తిరిగి వస్తూ భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లి నమస్కరించాడు. భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రునితో- నీ అరణ్యవాస వృత్తాంతాన్ని, సీతాన్వేషణ, రావణవధ వంటి ఘనకార్యాలను తెలుసుకున్నాను. నేను నీకు సంతోషంతో ఒక వరాన్ని ఇస్తానని చెప్పాడు. శ్రీరామచంద్రస్వామి తన కోసం ఏమీ కోరుకోలేదు. కాని మహర్షి మాటను తిరస్కరించకూడదు కాబట్టి ఒక వరాన్ని అడిగాడు. ఓ మహర్షీ! రుతునియమం లేకుండా అన్ని కాలాల్లో చెట్లు మధుర రసభరితములైన, అమృతతుల్యమైన పళ్లు ఇచ్చే వరమివ్వమని కోరాడు.
 
 ‘‘అకాలే ఫలినో వృక్షాః సర్వేచాపి మధుస్రవాః
 ఫలాన్యమృతకల్పాని బహూని వివిధాని చ!
 భవంతు మార్గే భగవన్నయోధ్యాం ప్రతిగచ్ఛతః’’ (రా.యు.స.128- శ్లో.18, 19)

 ఈ చెట్లు అన్ని కాలాల్లో ఫలాలనిస్తే పక్షులకు, వానరులకు, అనేకమంది బాటసారులకు మేలు కలుగుతుందని భావించాడు. తనకు లభించిన దానిని ఇతరులకు దానం చేసిన ఉత్తముడు రంతిదేవుడు. తనకు, తన కుటుంబానికి అవసరమని మర్నాడు కొరకు అతను ధనాన్ని, ఆహారాన్ని దాచుకునేవాడు కాదు. ఒకనాడు రంతిదేవుడు కుటుంబ సభ్యులతో కలిసి పాయసాన్ని, నీటినీ స్వీకరించేందుకు సిద్ధపడుతుండగా, ఇంతలోనే అతిథిగా వచ్చిన ఒక బ్రాహ్మణునికి కొంత పాయసాన్ని వడ్డించాడు. సరిగ్గా అదే సమయంలో తన వద్దకు వచ్చిన మరొక బాటసారికి మరికొంత పాయసాన్ని ఇచ్చాడు. మిగిలిన పాయసాన్ని తన దగ్గరి కుక్కలకు ఆహారంగా ఇవ్వమని వేరొకడు యాచింపగా, రంతిదేవుడు కుక్కలకు పాయసాన్ని ఇచ్చేశాడు. నీటితో కుటుంబ సభ్యుల కడుపునింపి, తాను నీటిని తాగబోతుండగా- దాహంతో తపించే ఒక వ్యక్తి నీళ్లివ్వమని ఆర్తితో కేకపెట్టాడు. అతని కేకకు రంతిదేవుని మనసు కలచివేసింది. మిగిలిన నీటినంతా అతనికిచ్చేసిన వెంటనే ఈ విధంగా ప్రార్థించాడు.
 
 ‘న కామయే హం గతిమీశ్వరాణాం అష్టర్ధియుక్తామపునర్భవం చ’
 ఆర్తిం ప్రపద్యే ఖిల దేహభాజామంతస్థ్సితో యేన భవంత్యదుఃఖాః

 ‘‘యోగ సిద్ధులు కల బ్రహ్మపదవి నాకు అక్కర్లేదు. పునర్జన్మ లేని విధంగా మోక్షం కలగాలని కోరను. ఆకలితో దప్పికతో అలమటించిపోతున్న వారందరి బాధలు తొలగాలని, ఆ బాధలను వారి బదులు తాను అనుభవించునట్లుగా అనుగ్రహించవలెనని ప్రార్థనాపూర్వకంగా పలికాడు. ఇది రంతిదేవుని నోటి నుంచి వెలువడిన వాక్కు. ఆయన హృదయం నుంచి పొంగుకొచ్చిన అమృత వాగ్ధార ఇది. ఇతరులు దుఃఖపడవద్దు, హాయిగా ఉండాలి. ఎదుటి వారి దుఃఖాలను వారి బదులు తాను అనుభవించాలి అని తలపోయడం మచ్చుతునక. ఈ మహత్తర భావన మానవులై జన్మించిన వారందరి హృదయాలకు చేరువ కావాలి. ఆదర్శప్రాయమైన ‘ఉత్తముల స్వభావం’ ప్రజలందరికీ అలవడాలి. ఆచరణలోకీ రావాలి.
 - సముద్రాల శఠగోపాచార్యులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement