విపుల ప్రపంచంలోకి వేయిపడగలు | Veyipadagalu written by Viswanadha Satyanarayana | Sakshi
Sakshi News home page

విపుల ప్రపంచంలోకి వేయిపడగలు

Published Mon, Jan 11 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

విపుల ప్రపంచంలోకి వేయిపడగలు

విపుల ప్రపంచంలోకి వేయిపడగలు

వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది.
 
వేయిపడగలు ఒక వేదనామయమైన జాతీయ నవల. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఎనభై ఏళ్ళ కింద తన ముప్పయి తొమ్మిదవ ఏట 1934లో రచించిన బృహన్నవల. ఈ నవల వెలువడిన నాటినుండి అనేకానేక చర్చలు, విమర్శలు, పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ చర్చకు వస్తున్నది. ఇంత పెద్ద నవల అయినా అనేకానేక ముద్రణలు పొంది ఈ తరం పాఠకులను కూడా చదివింప జేస్తున్నది.  సామాజిక, రాజకీయ. సాంస్కృతిక, ఆర్థిక, విద్య మొదలైన పలు రంగాలలో బహుముఖాలుగా విస్తరించిన ఈ నవలను హిందీలోకి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించి ఉత్తర భారతీయులకు పరిచయం చేశారు. తరువాత గుజరాతీలోకి అనువదించబడింది.
 
 అయినా ఇంకా ఎన్నో భాషలలోకి రావలసిన ఆవశ్యకత ఉండేది. ముఖ్యంగా ప్రపంచ ప్రజలు చదువుకోవడానికి ఇంగ్లీషులోకి రావాలి. ఆ పని ఇప్పుడు విశ్వనాథ సాహిత్యపీఠం నెలకొల్పి ఎనలేని సాహితీసేవలందజేస్తున్న డాక్టర్ వెల్చాల కొండలరావు పూనుకోవడంతో సాధ్యపడింది. తెలుగు, ఇంగ్లీషు భాషలలో నిష్ణాతులు, రచయితలు, విమర్శకులు అయిన డా.కె.అరుణావ్యాస్, డా. వైదేహి శశిధర్, చేపూరి సుబ్బారావు, ఉప్పులూరి ఆత్రేయ శర్మ, ఎస్.నారాయణస్వామి అనువదించారు. ఎవరు ఏ అధ్యాయాలు అనువదించారో పీఠికలో వివరించారు. అయితే, ఐదుగురి అనువాదం ఒకే తీరులో ఉండి చదువరులకు అంతభేదం కనిపించకపోవడం విశేషం. తమ భాషా సంపదలను, వ్యక్తీకరణలను, వాక్యనిర్మాణాలను తమ శైలిలో కాక మూల రచయితకు అనుగుణంగా మలచుకున్న తీరు అద్భుతం.
 
 వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది. భాషలోని తీపి, పటుత్వం, సారళ్యం, సరసం, చమత్కారం, గాంభీర్యం అంతా నవలలో పరచుకొని ప్రవహిస్తుంది. తెలుగువారి సంవత్సరాలు, రుతువులు, నెలలు, తిథులు, పగళ్ళు, రాత్రులు, వాటిని అనుసరించిన ప్రకృతి పాఠకునికి ఆకాలానుభూతిని కలిగిస్తుంది. శ్రావణమాసం మబ్బులు, శరత్కాలపు వెన్నెలలు, మాఘమాసం చలి, వైశాఖమాసం ఎండలు, బహుళపంచమి వెన్నెల, శుక్లపక్షపు వెన్నెల, పున్నమినాటి వెన్నెల, అమావాస్య చీకట్లు, ఒకటేమిటి ఈ నవలలో ఒక సంవత్సరంలోని అన్ని రోజుల ప్రకృతిని అనుభవించవచ్చు.
 
 ఇది తెలుగు సామాన్య ప్రజల క్యాలెండరు. రైతుల పంచాంగం. ఇవేకాక, ఎంతో వైభవంగా ఉన్న సంగీతం, నాట్యం, సాహిత్యం, తెలుగు కావ్యాలే కాదు, ఇంగ్లీషు ఫ్రెంచి భాషలలోని గొప్ప రచనలు, సంస్కృత భాషలోని గొప్ప కావ్యాలు, తెలుగు కీర్తనలు, జావళీలు, జానపదాలు చర్చించడాలు, విమర్శించడాలు, ప్రశంసించడాలు వంటివెన్నో నవలలో ఉన్నాయి. ఇంకా పురుషార్థాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ఉపనిషత్సారాంశాలు, బ్రహ్మవిద్య, బ్రహ్మజ్ఞానము, పరావిద్యా రహస్యాలు అనేకం నవలలో దర్శనమిస్తాయి. ప్రతీకలు, ప్రాగ్రూప దృక్పథాలు విగూఢంగా ఉన్నాయి. రచనా విధానంలో వ్యావహారికత, పలుకుబడులు, సామెతలు, జాతీయాలు, సంభాషణా చాతుర్యాలు, చమత్కారాలు, పాత్రోచితమైన హావభావ ప్రకటనలు, తెలుగు భాషా సౌకుమార్యమంతా కుప్పవోశారు.
 
ఈ జీవసంపద అంతా ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నం కావడం, ఆ ధాటికి జాతి యావత్తు చలించిపోవడం చూసి ఒక మహాదుఃఖాన్ని అనుభవించారు విశ్వనాథ. అదే జీవుని వేదన అయింది. అదే వేయిపడగలు రాయడానికి, రామాయణ కల్పవృక్షం రాయడానికి పునాది అయింది.
 
సరిగ్గా ఆ సమయంలోనే జాతీయవాదం, స్వాతంత్య్ర పోరాటం జరగడం, ఝాన్సీ రాణి మొదలుకొని గాంధీ వరకు జరిగిన పోరాట చరిత్ర విశ్వనాథ మనసును ఆవరించి ఉండడం ఈ నవల వెనుక కనిపించని నేపథ్యం. దాంపత్య ధర్మానికి బదులు ప్రేమలు, భోగాలు, లోలత్వాలు చోటుచేసుకోవడం, కుటుంబ సంబంధాలు తెగిపోవడం, ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడమే కాదు, ఆ ప్రకృతి సంపదను భౌతికంగా మానసికంగా అనుభవించే కపటమెరుగని ప్రజలకు సౌకర్యాలపేరుతో యంత్రాలు వచ్చి సుఖాలను చిన్నాభిన్నం చేయడం, ఆవుతోగాని, ఏనుగుతోగాని, కుక్కతోగాని, చీమతోగాని మనుషులకుండే జీవానుబంధాన్ని తెంచే స్థితి రావడం చూసి విశ్వనాథ ఈ రచన చేశారు.
 
అనువాదకులు అయిదుగురు దోసిలి నిండా పట్టిన ధాన్యంలో నుండి ఒక్క గింజ కూడా జారిపోనంత పదిలంగా ప్రతిపదాన్ని, వాక్యాన్ని ఇంగ్లీషులోనికి దించారు. కవిత్రయం మహాభారతాన్ని అనువదించడానికి స్వేచ్ఛను తీసుకున్నారు, కాని ఈ అనువాదకులు విశ్వనాథే తమ ముందు కూర్చుని ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మూలవిధేయంగా అనువదించారు. పి.వి.నరసింహారావు చివరి మూడు అధ్యాయాలు అక్కరలేదని అనువాదం చేయలేదు. ఆ చొరవను ఈ అనువాదకులు తీసుకోలేదు. తెలుగు పద్యాలు, కీర్తనలు, జావళీలు, భంగిమలు, సంస్కృత కీర్తనలు మొదలైనవి యథాతథంగా ఇంగ్లీషు లిప్యంతరీకరణం చేసిన పాదసూచికల్లో వివరణ ఇచ్చారు. వీటిని భారతీయులు గ్రహిస్తారు, పాశ్చాత్యులు తెలుసుకుంటారు.
 
వేయిపడగలు నిన్నటి నవల కాదు. అది నేటికీ సందర్భమే. ఒక ప్రజాజీవన వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఒక విద్యా వ్యవస్థ, ఒక వర్ణ వ్యవస్థ, ఒక మత సిద్ధాంతం, ఒక ప్రకృతిజీవనం ఇట్లా పదమూడు అంశాలను ఎత్తిచూపుతూ, ధర్మారావు, అరుంధతి, గిరిక, హరప్ప, రంగారావు, పసరిక మొదలైన పాత్రల విశేషాలను తెలుపుతూ ‘ముందుమాట’ రాశారు. వేయిపడగలు నవల సంప్రదాయవాదమా? వర్ణవివక్షతతో రాసిందా? మత పిడివాదం ఇందులో ఉందా? మొదలైన అనేక ప్రశ్నలకు వెల్చాల కొండలరావు సముచితమైన వాదంతో ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ వేయిపడగలు’ పేరుతో పీఠిక రాశారు.

నవల చివరిలో ధర్మారావు అరుంధతితో అనిన మాటలు: ‘‘నీవు మిగిలితివి. నా జాతి శక్తివి. నాయదృష్టము. నీవు మిగిలితివి ’’. జాతి శక్తి మిగిలినదన్నాడు కాని నా అర్ధాంగివి, నా ప్రేయసివి, నా సౌందర్యరాశివి వంటివి ప్రయోగించలేదు. ఈ పాత్రలు వ్యక్తిత్వ పరిధికి మించినవి. రామేశ్వరశాస్త్రి పూర్వీకులనుండి ఇప్పటిదాకా సాగిన ఈ కథ ఒక జాతి కథ.
 
థౌజండ్ హుడ్స్
(వేయి పడగలు ఆంగ్లానువాదం) సంపాదకుడు:
చేపూరి సుబ్బారావు అనువాదకులు: కె.అరుణావ్యాస్, ఉప్పులూరి ఆత్రేయ శర్మ, ఎస్.నారాయణస్వామి, వైదేహీ శశిధర్, చేపూరి సుబ్బారావు.
ప్రచురణ: విశ్వనాథ పబ్లికేషన్స్, విశ్వనాథ సాహిత్య పీఠం
 వెల: 1000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement