సభలో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) ఈ రోజు శాసనసభలో తీవ్ర దుమారం రేపింది. శాసనసభలో కీలక చర్చ జరుగుతుందని భావించిన రోజున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ హాజరుకాలేదు. బిల్లుపై ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు చీలిపోయారు. బిల్లు కాపీ ఇవ్వగానే తెలంగాణ ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బిల్లు కాపీలను తగులబెట్టగా, మరికొందరు బిల్లు కాపీలను చించేశారు. సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్నారని, అడ్డగోలు విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఈ రోజు సభ జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభలో ఏం జరిగింది? తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైందా? లేదా? శ్రీధర్ బాబు ఏం చెబుతున్నారు? ఉపసభాపతి తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?
బిల్లు వస్తే దాని సంగతి చూస్తానన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమయ్యారు? ఈ రోజు శాసనసభ కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక ప్రకారమే జరిగిందా? సీఎం కిరణ్, చంద్రబాబు కావాలనే హాజరుకాలేదా?
అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ప్రారంభమైందని ఒక పక్క తెలంగాణ సభ్యులు చెబుతుంటే, లేదు ఇంకా ప్రారంభం కాలేదని మరో పక్క సీమాంధ్ర శాసనసభ్యులు అంటున్నారు. అసలు అజెండాలోలేని అంశంపై సభలో చర్చను ఎలా చేపడతారని సీమాంధ్ర ఎంఎల్‌ఏలు ప్రశ్నిస్తున్నారు. దీంతో తాజా వివాదం మొదలైంది. సభలో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు ముసాయిదా బిల్లుపై సభలో చర్చను ప్రారంభించాలని డిప్యుటీ స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్షనేత మాట్లాడాలని డిప్యుటీ స్పీకర్ భట్టి విక్రమార్క కోరారు. అదే సమయంలో ఈ వివాదం ప్రారంభమైంది. సభలో గందరగోళం కొనసాగడంతో డిప్యుటీ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో బీఏసీని సమావేశపరచాకే ముసాయిదా బిల్లుపై సభలో చర్చ జరుగుతుందా? లేక సభలో ఇప్పటికే చర్చ మొదలైనట్లు లెక్కా అనేది సభ్యులకు కూడా అర్ధం కావడంలేదు. ఈ విషయమై వారు తర్జనభర్జన పడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం రాజ్యాంగ నిబంధనల ప్రకారమే శానససభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లు చెప్పారు. చర్చ మొదలైందా? లేదా? అన్న ప్రశ్నలకు స్పీకర్ మాత్రమే సమాదానం చెప్పగలరు.
తెలంగాణ ముసాయిదా బిల్లును బీఏసీలో చర్చించకుండా, సభ అనుమతి లేకుండా చర్చకు అనుమతించడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేద న వ్యక్తం చేస్తోంది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నిరసనవ్యక్తంచేస్తున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలంటూ ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ సమైక్యరాష్ట్రం కోసం వాయిదా తీర్మానాలను, ప్రైవేట్ మెంబర్ తీర్మానాలను ఇస్తే వాటిని స్పీకర్ తిరస్కరించారు. అయితే దీనిపై పట్టువదలకుండా మరో మారు ఆ పార్టీ సభ్యులు ప్రైవేట్ మెంబర్ తీర్మానాన్ని ఇచ్చారు.
సీఎం కిరణ్‌ను నమ్మి మోసపోయాం అని, సీఎం తమను మభ్యపెట్టి మోసం చేశారని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు మండిపడుతున్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి రావడానికి సీఎం కిరణ్ కారణమంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంఎల్‌ఏలు లాబీల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానంకు ముందుగానే ఇచ్చిన మాటప్రకారం విభజన ప్రక్రియకు సీఎం పూర్తీగా సహకరిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. తన ఇమేజ్ కోసం మాత్రమే మీడియా ముందు సీఎం ప్రకటనలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.
విభజనపై సీఎం కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, అధిష్టానంకు సహకరించారని భావిస్తున్నారు. మూడు నెలల క్రితమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు సమైక్యాంధ్రపై తీర్మానం చేసుంటే బావుండేదని అనుకుంటున్నారు. సీఎం మాట కాదని, తమ పదవులకు రాజీనామాలు చేసుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని సీమాంధ్ర మంత్రులు అంటున్నారు.