సాక్షి, విశాఖపట్నం : అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో అధికారిపైనా ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. దీన్ని కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబు.. ఐటీశాఖ దర్యాప్తులపై మాత్రం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ శాఖ దర్యాప్తులపై ఎల్లో మీడియా కూడా స్పందించడం లేదన్నారు. తప్పు చేసింది ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి అవసరం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు దొంగలా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని విమర్శించారు. రాజధానిపై వ్యాపారస్తులతో కలిసి నారాయణ కమిటీ వేశారని మండిపడ్డారు. రూ. లక్షా 9వేల కోట్లతో ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చేసినా రియాల్టీగా ఉంటుందన్నారు. ఐదేళ్లలో హైదరాబాద్‌కు ధీటుగా విశాఖను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు వెల్లడించారు.
విశాఖ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 47వేల 13 మంది ఇళ్లపట్టాల లబ్ధిదారులు ఉన్నారని బొత్స తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 10 మండలాల పరిధిలో భూసేకరణ చేపట్టామని.. ఇప్పటివరకు 6వేల 116 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని చెప్పారు. అసైన్డ్ భూములపై సాగు హక్కు మాత్రమే ఉంటుందన్నారు. ఇళ్ల పట్టాల భూముల సర్వే కోసం.. రెవెన్యూ, సర్వే, అటవీశాఖతో కూడిన 38 బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 6 వేల 116 ఎకరాల్లో 58 ప్లాట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 25 బ్లాక్‌లు ప్రభుత్వానికి ఇచ్చారని.. మిగిలిన బ్లాక్‌లు కూడా త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. విశాఖలో పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని గుర్తుచేశారు.
విశాఖలో బలవంతపు భూసేకరణ అవాస్తవం..
విశాఖపట్నంలో బలవంతపు భూసేకరణ జరిగిందనే వార్తల్లో వాస్తవం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భూములు ఇవ్వనివారి దగ్గరి నుంచి భూసేకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైనవారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే 6 లక్షల పెన్షన్లు పెరిగాయని గుర్తుచేశారు. అనర్హులుగా గుర్తించిన 4 లక్షల మంది పెన్షన్లను మళ్లీ తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు. వారిలో అర్హులుగా తేలినవారికి 2 నెలల పెన్షన్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment