చంద్రబాబు దొంగాట బట్టబయలు | Chandrababu Drama Revealed In AP Special Status Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దొంగాట బట్టబయలు

Published Wed, Mar 27 2019 5:17 AM | Last Updated on Wed, Mar 27 2019 5:17 AM

Chandrababu Drama Revealed In AP Special Status Issue - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న దొంగాట బట్టబయలైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ ఆయన స్వయంగా సంతకం చేసి కేంద్రానికి లేఖ రాశారని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ తాజాగా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఆ లేఖ ప్రతులను ఆయన బయట పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని నిధుల ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు వేసి, కేంద్రానికి ప్రతిపాదించిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి తలూపిన చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాను పోరాడుతున్నానంటూ ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. 

హోదా మాట ఎత్తితే జైలుకేనట! 
పార్లమెంట్‌లో సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గత ఐదేళ్లుగా వివిధ రూపాల్లో హోదా కోసం ఉద్యమించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. హోదా అనే మాట మాట్లాడితే అరెస్టు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించింది. అయినా వైఎస్‌ అన్నింటినీ తట్టుకుని హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టారు. హోదా బదులు ప్రత్యేక ఆర్థిక సహాయం(ప్యాకేజీ) ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం కూడా చేశారు. కేంద్ర మంత్రులను రప్పించి, సన్మానాలు చేశారు. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దంటూ చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు చివరకు ప్రజాగ్రహానికి తలొగ్గి, యూటర్న్‌ తీసుకున్నారు. ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ రాసి, ఇప్పుడు హోదా కావాలని డిమాండ్‌ చేస్తుండటం తమను ఇరకాటంలోకి నెట్టిందని టీడీపీ సీనియర్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

హోదా సంజీవని కాదంటూ అవహేళన 
విభజన వల్ల నష్టపోయే ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జట్టుకట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన సభలో ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదు, 15 ఏళ్లు కల్పించాలంటూ ఏన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీని కోరుతున్నానని చంద్రబాబు చెప్పారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ అధికారంలోకి వచ్చాయి. పార్లమెంట్‌ తొలి సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని 2014 జూన్‌ 12న కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని.. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయో చెప్పాలంటూ చంద్రబాబు హేళన చేస్తూ వచ్చారు. 

కేంద్ర సాయాన్ని స్వాగతించిన బాబు 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్రంపై.. శాసనసభ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని 2016 జూలై 29న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించడడం రాష్ట్రాన్ని కుదిపేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా 2016 ఆగస్టు 2న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బంద్‌ చేపట్టింది. 2016 ఆగస్టు 8న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. అటు పార్లమెంట్‌.. ఇటు శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ నిలదీస్తుందని భావించిన సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. విభజన చట్టంలోని హామీలకే సహాయం ముసుగేసి 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక సహాయాన్ని ప్రకటించారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు దాన్ని స్వాగతిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

నాడొక మాట.. నేడొక మాట
ప్రత్యేకసహాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 2016 సెప్టెంబరు 10న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో జరిగిన చర్చలో వివరించారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తామెలాంటి ప్రతిపాదన చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు గోవిందరావు తెలిపారని గుర్తుచేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం నిర్ణయం తీసుకుందని, హోదా వల్ల పారిశ్రామిక రాయితీలు వచ్చే అవకాశం లేని.. ఒకవేళ రాయితీలు వస్తాయని ఏదైనా జీవో ఉంటే చూపించాలని.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక సహాయం వల్లే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని సెలవిచ్చారు. ప్రత్యేక సహాయాన్ని ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ అక్టోబర్‌ 24న సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక సహాయం కింద ఏడాదికి రూ.3,500 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.17,500 కోట్లు వస్తాయని.. వాటిని ఈఏపీ ప్రాజెక్టులకు విడుదల చేయాలని ఆ లేఖలో ప్రతిపాదించారు. దీన్నిబట్టి ప్రత్యేక సహాయం ప్రతిపాదనలను రూపకల్పన చేసింది సీఎం చంద్రబాబే అన్నది స్పష్టమవుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేసిన పోరాటాల వల్ల హోదా ఉద్యమం ఉధృతం కావడంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన పేరిట ఎన్నికల ముందు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని.. హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయని.. భారీ ఎత్తున పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొడుతుండడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement