సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులకు తోడు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూసుకుపోతుండటం, లోకేశ్ ఓటమి సంకేతాల నేపథ్యంలో చంద్రబాబులో ఆందోళన మొదలయ్యింది. భారీయెత్తున డబ్బులు వెదజల్లి కొడుకుని గెలిపించేందుకు తెలుగుదేశం అధినేత స్కెచ్చేశారు. మొత్తం మీద రూ.300 కోట్లకు పైగా సొమ్మును మంగళగిరిలో కుమ్మరించాలని నిర్ణయించారు. లోకేశ్ కోసం పలు నియోజకవర్గాలను పరిశీలించినా.. మంగళగిరి నుంచి పోటీ చేయిస్తే రాజధాని ప్రాంతంపై పట్టు సాధించవచ్చని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. అలాగే కుమారుడికి రాజకీయంగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్టు ఉంటుందని భావించి అక్కడ ఎన్నికల బరిలో దింపారు. అయితే మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడం, అక్కడ పార్టీ బలంగా ఉండడం, మరోవైపు టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడం, సామాజికవర్గాల సమతుల్యత టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది.
నియోజకవర్గంలో మంగళగిరి మున్సిపాల్టీలో మాత్రమే టీడీపీకి కొంత ఆశాజనక పరిస్థితి ఉండగా మంగళగిరి రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2.58 లక్షలుండగా ఇందులో అత్యధికంగా సుమారు 68 వేల పద్మశాలీల ఓట్లున్నాయి. ఆ వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వంటి వారికి చంద్రబాబు సీటు ఇస్తానని ఆశపెట్టి పార్టీలో చేర్చుకుని చివరి నిమిషంలో వారికి హ్యాండిచ్చారు. దీంతో ఆ వర్గం నేతలంతా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తమకు దక్కాల్సిన సీటును సీఎం తన కుమారుడికి కట్టబెట్టారని ఆందోళన వ్యక్తం చేసిన పద్మశాలీ సంఘం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని, లోకేశ్‌ను గెలవనివ్వమని ప్రకటించింది. దీంతో అవాక్కయిన టీడీపీ.. ఆ వర్గం నేతల్ని లొంగదీసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైంది. దీనికితోడు రాజధాని నిర్మాణం పేరుతో స్థానిక ప్రజలను, రైతులను చంద్రబాబు పెట్టిన ఇబ్బందులతో మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు లోకేశ్ గతంలో మాదిరిగానే.. ఎన్నికల ప్రచారంలో సైతం పదే పదే తడబడుతూ తప్పులు మాట్లాడుతుండటం.. స్థానికులకు నవ్వు పుట్టిస్తుంటే.. టీడీపీ నేతలకు చికాకు తెప్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోకేశ్ ఓడిపోతే పరువు పోతుందని భావించిన చంద్రబాబు మంగళగిరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. తనదైన శైలిలో పక్కా వ్యూహాన్ని రూపొందించారు.
కోటరీ వ్యక్తులతో నంద్యాల ఫార్ములా అమలు!
విశ్వసనీయ సమాచారం మేరకు.. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కోటరీలోని ముగ్గురు ముఖ్య వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇస్తూ పనిచేయిస్తున్నారు. నియోజకవర్గాన్ని క్లస్టర్లు, సెక్టార్లుగా విభజించి.. చిత్తూరు, హైదరాబాద్, విశాఖ, గుంటూరు ప్రాంతాలకు చెందిన తమ సొంత మనుషులను రప్పించి ఆ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. ఈ బృందాలు స్థానిక టీడీపీ నాయకుల సాయంతో తమకు కేటాయించిన క్లస్టర్లలో ఓటర్లు, వారి అవసరాలు, వారి రాజకీయ నేపథ్యం వంటి వివరాలను తెలుసుకుని ఎవరికి, ఎలా పంపిణీ డబ్బు పంచాలనే దానిపై ఒక అవగాహనతో చాపకింద నీరులా పనిచేస్తున్నారు.
తొలుత ఎంపిక చేసిన ప్రాంతాలపై దృష్టి సారించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మంగళగిరి రూరల్, టౌన్ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటర్లకు అధునాతన స్ప్లిట్ ఏసీలను పంపిణీ చేయిస్తున్నారు. ఓటర్లకు చిన్న స్లిప్ ఇచ్చి దాన్ని విజయవాడలోని పలానా షోరూమ్‌లో చూపిస్తే ఏసీ డెలివరీ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటికే వేలాది ఏసీలు పంచినట్లు సమాచారం. ఏసీలు వద్దన్న వారికి, ఏసీలు పెట్టుకోలేని వారికి రూ.20 వేలు సొమ్ము నేరుగా ఇస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ డబ్బు ప్రభావాన్ని పెంచుకుంటూ వెళ్లి చివరి రెండు రోజుల్లో తారస్థాయికి తీసుకెళ్లేలా వ్యూహం రూపొందించారు.
ఓటుకు రూ.12 వేలు!
తెలుగుదేశంపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటుకు రూ.12 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులే ఆయా ప్రాంతాల్లో చెబుతుండటం గమనార్హం. లక్ష మంది ఓటర్లకు రూ.12 వేలు చొప్పున, మరో లక్ష మందికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని, అవసరాన్ని బట్టి ఇంకా పెంచాలని ఆలోచన చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న తాడేపల్లి మండలంలో డబ్బు పంపిణీ ఎక్కువగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక, నూతక్కి, చిర్రావూరు, పాతూరు వంటి పలు గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా, నిఘా తప్పించుకునేందుకు.. ఆయా గ్రామాలకు పోలీసు వాహనాల్లో డబ్బు పంపేందుకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇందుకు అనుగుణంగా బందోబస్తు వాహనాల్లో తమకు అనుకూలమైన వారిని గతంలోనే నియమించారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం ఐటీ కంపెనీల నుంచి పోలీసు జీపుల్లోనే భారీగా డబ్బును నియోజకవర్గంలో డంప్ చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే డబ్బు పంపిణీని నేరుగా చేయాలా లేక ఓటర్ల ఖాతాల్లో వేయాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ల బ్యాంకు అకౌంట్లను టీడీపీ సేవా మిత్రల ద్వారా సేకరించిన సంగతి తెలిసిందే. అయితే వేరే మార్గంలో డబ్బు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుని ప్రత్యర్థులను తప్పుదారి పట్టించేందుకే బ్యాంకు అకౌంట్ల సేకరణ డ్రామా ఆడారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా లోకేశ్ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment