కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగభృతి సాధ్యం కాదన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలా ప్రకటించారని, కేసీఆర్ మోసపూరిత హామీలను నిరుద్యోగులు ఎవరూ నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ కోచైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్ కాపీకొట్టిందని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్‌ఎస్ నెరవేర్చలేదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దక్షిణ భారతదేశ బడ్జెట్ చాలదని చెప్పిన కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దుపై టీఆర్‌ఎస్ ఎందుకు స్పందించలేదని అడిగారు. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ 4 విడతలుగా మాఫీ చేయడం వల్ల రైతుల మీద అదనపు వడ్డీ భారం పడిందన్నారు. టీఆర్‌ఎస్ రుణమాఫీ వల్ల బ్యాంకర్లకే లాభం జరిగిందన్నారు.
ఏక కాలంలో రూ.2 లక్షల మాఫీ..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే విశ్వసించి కాంగ్రెస్‌కే పట్టం కడతారని జోస్యం చెప్పారు. నాలుగు సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉండి కాంగ్రెస్ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రావడంతోనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేస్తామని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉండి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టని కేసీఆర్, మళ్లీ అధికారంలోకి వస్తే ఇండ్లు కడతానంటే ప్రజలు ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment