గెలవకుంటే రాజకీయ సన్యాసం | KTR Comments Over Elections In Meet The Press | Sakshi
Sakshi News home page

గెలవకుంటే రాజకీయ సన్యాసం

Published Fri, Nov 16 2018 12:40 AM | Last Updated on Fri, Nov 16 2018 4:25 AM

KTR Comments Over Elections In Meet The Press - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కె.తారకరామారావు పునరుద్ఘాటించారు. ఇంకో ఇరవై ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నప్పటికీ, ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలకు సవాల్‌ విసిరానని.. దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా తెలంగాణను అనుమానాల నీలినీడల నుంచి ఆర్థిక, రాజకీయ, ప్రగతిశీల, దార్శనిక అంశాల్లో ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేశారని.. ఈ ప్రగతి కొనసాగాలని, కారు ఆగకుండా డ్రైవర్‌ మారకుండా ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. ప్రజలు కచ్చితంగా టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని చెబుతూ.. తాను అహంకారంతో ఈ మాటలు అనడంలేదని, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానని పేర్కొన్నారు. గురువారమిక్కడ హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందస్తు ఎన్నికల అంశాలను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను వివరించిన కేటీఆర్‌.. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...  

అవకాశవాదానికి మారుపేరు బాబు..
రాజకీయాల్లో 40 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబులాగా మేం సొంత డబ్బా కొట్టుకోం. మా భుజాలు మేం చరుచుకోం. హైదరాబాద్‌ నిర్మించా నని, చార్మినార్‌కు ముగ్గు పోశానని చంద్రబాబు ఎన్నో చెప్పారు. అయినా 2004లో టీడీపీని ఇక్కడ ఓడించారు. చంద్రబాబు పరిపాలించే రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇవేమీ లేవు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసి ఎన్నికలను ఎదుర్కొలేదు. ఒక్క వైఎస్సార్‌సీపీతో తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు స్వయం ప్రకాశంలేని చంద్రుడు. చంద్రబాబు అవకాశవాదానికి మారుపేరు. ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా మాటలు మారుస్తాడు. 

నాకు ఇదే ఎక్కువ... 
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2006లో కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి, ఆ తర్వాత పీసీసీ చీఫ్‌ సవాల్‌తో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. అంతకు కొన్ని నెలల ముందు అమెరికాలో నేను పనిచేసే సంస్థలో బదిలీపై హైదరాబాద్‌కు వచ్చాను. దక్షిణాసియా హెడ్‌గా అప్పడు నా వేతనం నెలకు నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు ఉండేది. కరీంనగర్‌ ఉపఎన్నిక రావడంతో మూడు నెలలు సెలవు కావాలని సంస్థను కోరా. వారు నిరాకరించడంతో ఇంట్లోనూ ఎవరికీ చెప్పకుండా రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేశాను. ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రతిపాదనను కేసీఆర్‌ తెచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ వైఖరి సరిగా లేక ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇదే తెలంగాణకు మేలు చేసింది. తెలంగాణ కోసం పని చేసే ఓ పార్టీ ఉండడానికి కారణమైంది. నేను మంత్రి అవుతానని ఊహించలేదు. ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. కేసీఆర్‌ దయ వల్ల అది జరిగింది. ఇదే ఎక్కువ. ఇంతకంటే ఏమీ కోరుకోవడంలేదు. మంత్రిగా ఉంటే సంతోషం. లేకున్నా ఏమీ లేదు. మిగతా విషయాలపై జరిగే ప్రచారాలను పట్టించుకోను. తెలంగాణకు మరో 15 ఏళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండాలి. 

బీజేపీకి డిపాజిట్లు రావు... 
రాజ్యాంగంలోని వెసులుబాటు మేరకే అసెంబ్లీని రద్దు చేశాం. గతంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ చేసిందే ఇప్పుడు మేం చేశాం. దీంట్లో బీజేపీతో సఖ్యత అనేవి కేవలం ఆరోపణలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన హామీల విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా, పార్లమెంట్‌లో నిరసన తెలిపినా దున్నపోతు మీద వాన కురిసినట్లుగా వ్యవహరించింది. బీజేపీ ముమ్మాటికి మా రాజకీయ ప్రత్యర్థే. ఆ పార్టీకి వంద స్థానాల్లో డిపాజిట్లు రాకుండా చేస్తాం. మిగిలిన స్థానాల్లోనూ ఓడిస్తాం. బీజేపీ ఇప్పుడున్న ఐదు సీట్లలోనూ గెలవకుండా చేస్తాం. 

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... 
ధర్నాచౌక్‌ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అసలు నిరసనలే జరగకూడదనేది మా విధానం కాదు. ధర్నాచౌక్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అక్కడి స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. గాంధీభవన్, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లకు తాళాలు వేశారు కాబట్టి కాంగ్రెస్, టీడీపీలలో టికెట్లు రానివారు ధర్నాచౌక్‌లో నిరసనలు చేసుకోవచ్చు.  

ప్రజలే నిర్ణయిస్తారు... 
ముఖ్యమంత్రి ఎవరినీ కలవడంలేదనేది కరెక్టు కాదు. ప్రజలను కలిసి రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వడం.. వాటిని మీడియాలో గొప్పగా చెప్పుకోవడం సీఎం స్థాయి వారు చేయడం కరెక్టు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పరిపాలన వికేంద్రీకరణతో చిన్న ఆవాసాలు గ్రామాలయ్యాయి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ వ్యవస్థ ఉంది. అక్కడే అన్నీ జరగాలి. అలా కాకుండా సీఎంను కలిస్తేనే అవి నెరవేరితే ఆ ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడం లేదనే చెప్పొచ్చు. మా ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనట్లుగా 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తోంది. 80 లక్షల మంది భూరికార్డులను ప్రక్షాళన చేసింది. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌కే పరిమితమని, సచివాలయానికి రారనే వాదనలు సరికాదు. ముఖ్యమంత్రి ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేలా చూడాలి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. అయినా ప్రజలే అంతిమ నిర్ణేతలు. మా ప్రభుత్వం, సీఎం పనితీరు ఎలా ఉందనేది వారే తీర్పు ఇస్తారు. మా అభ్యర్థులపై వచ్చే విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల గురించి అందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రజల తీర్పును గౌరవిస్తాం. 

పోరాటయోధుడు, మంచి పాలకుడు... 
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉండేవి. హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో సందేహాలు, భవిష్యత్తు ఏమవుతుందోనని అనుమానాలు, కరెంటు కోతలు, ఆర్థిక పిరిస్థితి ఏమిటో తెలియదు.. ఇలా వంద అనుమానాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనలో దేశానికే కొత్త దిశను చూపారు. తెలంగాణలో పరిపాలించే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లలో 90 శాతం పూర్తయ్యింది. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వమైతే నలభై ఏళ్లు పట్టేది. 

రాజకీయ అవినీతి తగ్గించాం..
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత సీఎం కేసీఆర్‌ పరిపాలనపై దృష్టి సారించి అభివృద్ధి చేశారని.. చంద్రబాబు మాత్రం పొరుగు రాష్ట్రంతో కయ్యానికి కాలు దువ్వుతూ పరిపాలన పక్కనపెట్టారని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చెప్పారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమన్వయంతో ఉండడం వల్ల మహారాష్ట్ర అంగీకారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లలోనే 90 శాతం పూర్తి చేశాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అవినీతిని గణనీయంగా తగ్గించింది. ఒక్క ఇసుక ఆదాయమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం వచ్చింది. టీఆర్‌ఎస్‌ అధికారంలో నాలుగేళ్లలోనే రూ.2వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఒక్క విషయంతోనే ఎవరు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. 

కాంగ్రెస్‌ కంటే మెరుగు... 
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాగానే పని చేసింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో 10వేల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసింది. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్లలోనే 1.09 లక్షల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 87వేల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో 32వేల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. పూర్తి పారదర్శకతో ఉద్యోగాల భర్తీ జరిగింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలతోనే నిరుద్యోగ సమస్య తీరదు. ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తూనే స్వయం ఉపాధి, ప్రైవేటురంగంలో పెట్టుబడులను సమీకరించి ఉపాధి కల్పన జరిగేలా మూడంచెల ప్రణాళిక అమలు చేస్తున్నాం. పరిశ్రమల స్థాపన కోసం కొత్త విధానాలు తెచ్చాం. 8వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తే వీటిలో 60 శాతం కార్యకలపాలు కూడా మొదలుపెట్టాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement