అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో మాట్లాడుతున్న కేటీఆర్
జవహర్‌నగర్/అమీర్‌పేట/అంబర్‌పేట: జవహర్‌నగర్ ప్రజలకు డంపింగ్‌యార్డ్ కారణంగా పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్‌నగర్ ప్రజలు అభద్రతకు లోనుకావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పడగానే జవహర్‌నగర్‌కు మరో 600 ఎకరాలు గ్రామకంఠంగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. మంగళవారం ఆయన మేడ్చల్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ సమస్యకు శాస్త్రీయంగా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో మల్లారెడ్డిని గెలిపించాలని కోరారు. మేడ్చల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి మాట్లాడుతూ...జవహర్‌నగర్‌లో అత్యధికశాతం నిరుపేదలున్నారని, వారికి రక్షణగా టీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో జవహర్‌నగర్‌ను గ్రామకంఠం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 318 ఎకరాలతో గ్రామకంఠంగా గుర్తించామన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో 600 ఎకరాలను గ్రామకంఠంగా గుర్తించి జవహర్‌నగర్‌ను పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేడ్చల్ తాజా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌యాదవ్, జహంగీర్, మల్లేష్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, రాజశేఖర్ పాల్గొన్నారు.
రాష్ట్రానికే ఆదర్శంగా సనత్‌నగర్
దేశంలో ఎక్కడాలేని విధంగా సనత్‌నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లను కట్టిస్తున్నామని మంత్రి కేటీఆర్ ఈన్నారు. సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి అమీర్‌పేట సత్యం థియేటర్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సనత్‌నగర్‌కు వచ్చిన చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్‌రూం కూడా నిర్మించలేదని మాట్లాడారని గుర్తు చేశారు. బాబు మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్లు, శేషుకుమారి, లక్ష్మిబాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబర్‌పేట ముఖచిత్రం మారుస్తాం
మూడుసార్లు అంబర్‌పేట ప్రజలు కిషన్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి అంబర్‌పేట టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌తో కలిసి అలీకేఫ్ చౌరస్తా నుంచి శ్రీరమణ చౌరస్తా, ఛేనంబర్ చౌరస్తాల మీదుగా ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాల మీదుగా రోడ్‌షో నిర్వహించారు. అలీకేఫ్ చౌరస్తా, ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాల్లో మాట్లాడుతూ మూడుసార్లు బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి ఓటు వేయడం తప్పయిందని మరోసారి ఆయనకు ఓటేసి తప్పు చేయవద్దని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ను గెలిపిస్తే అంబర్‌పేట ముఖచిత్రం మారుస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థి కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ 15 ఏళ్లల్లో కిషన్‌రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని తనకు అవకాశమిస్తే 3 ఏళ్లలో చేసి చూపిస్తానన్నారు. ఆయన అన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి కృష్ణయాదవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బాబు, లగడపాటి తట్టా,బుట్టా సర్దుకోవాల్సిందే
ముషీరాబాద్: టీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాము చెబుతున్నామని, ఈ మాయా కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పగలరా? అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా మాజీ హోం మంత్రి నాయినితో కలిసి రాంనగర్ చౌరస్తా నుంచి భోలక్‌పూర్, గాంధీనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలు మన చైతన్యానికి పరీక్ష కాబోతున్నాయన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్ గెలిస్తే సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు ముషీరాబాద్‌కు రూ.470 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు స్కైవే అందుబాటులోకి తెస్తామన్నారు. ఎలక్ట్రిక్ బస్‌లను తీసుకువచ్చి కాలుష్యాన్ని తగ్గిస్తామని తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతేమిటని ఓ మహిళ ప్రశ్నించగా లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుందని వాటిని త్వరలో మీ చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. బక్కపల్చటి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు నాలుగైదు పార్టీలు కలిసి రంగురంగుల జెండాలు కప్పుకుని ప్రజల ముందుకు వస్తున్నారని వీరిని చూసి గంగిరెద్దుల వాళ్లు వస్తున్నారని ప్రజలు పరేషాన్ అవుతున్నారన్నారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల సంస్కృతి మళ్లీ వస్తుందని రాజకీయ అస్థిరత ఏర్పడుతుందన్నారు. డిసెంబర్ 11 తరువాత చిలకజోస్యాలు చెప్పే లగడపాటి, డ్రామాలు ఆడే చంద్రబాబు తట్టా, బుట్టా సర్దుకొని అమరావతికి చెక్కేస్తారని జోస్యం చెప్పారు. వీరంతా చుట్టపు చూపుగా వచ్చే నాయకులని పక్కీ లోకల్ లీడర్ అయిన ముఠా గోపాల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సలీం, మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు వి.శ్రీనివాస్‌రెడ్డి, ముఠా జైసింహా, హరిబాబుయాదవ్, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment