‘సీల్డ్‌’ సీఎం వద్దు' సింహం లాంటి కేసీఆరే అవసరం | KTR Road Show in Khairatabad hyderabad | Sakshi
Sakshi News home page

‘సీల్డ్‌’ సీఎం వద్దు' సింహం లాంటి కేసీఆరే అవసరం

Published Tue, Nov 27 2018 10:33 AM | Last Updated on Tue, Nov 27 2018 10:33 AM

KTR Road Show in Khairatabad hyderabad - Sakshi

రోడ్‌షోలో కేటీఆర్, దానం, తలసాని

సోమాజిగూడ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచారని, తెలంగాణ వస్తే వివక్ష చూపుతారంటూ టీఆర్‌ఎస్‌పై అనుమానాలు.. అపోహలు సృష్టించారని, అయితే వాటన్నింటినీ పటాపంచలు చేశామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలో అన్ని ప్రాంతాలవారు జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారందరిలో నమ్మకాన్ని కలిగించారన్నారు. సోమవారం ఖైరతాబాద్‌ నియోజకవర్గం సోమాజిగూడలో టీఆర్‌ఎస్‌ రోడ్డుషోలో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘ఖైరతాబాద్‌లో బీజేపీ గెలిచిందంటే బీజేపీపై అభిమానంతో కాదు.. టీఆర్‌ఎస్‌పై అనుమానాలు, భయంతోనే చింతలను గెలిపించారు. చింతల గుడి అంటాడు.. బడి అంటాడు. అంతా మనమే కడుతున్నం. మోదీ సాబ్‌ మీటర్‌ దేశం మొత్తం డౌనవుతోంది. ఖైరతాబాద్‌లోనూ అంతే’’ అన్నారు. కేసీఆర్‌ ఒక్కడిని ఓడించేందుకు ఐదు పార్టీలు ఏకమయ్యాయని, కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ‘సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా.. సింహం లాంటి కేసీఆర్‌ కావాలా?’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. అభివృద్ధిలో నగరం దూసుకుపోతోందని, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు.

‘నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఎప్పుడూ కర్ఫ్యూ, శాంతి భద్రతల సమస్య లేదన్నారు. నిరంతరం తాగునీరు, విద్యుత్‌ సరఫరా చేశామని, రాజకీయ స్థిరత్వంతో రాష్ట్రం 17 శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోందన్నారు. అందుకే గూగుల్, అమెజాన్‌ లాంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతన్నాయన్నారు. ఒకప్పడు రేషన్‌ బియ్యానికి సీలింగ్‌ పెట్టారని, తమ ప్రభుత్వంలో బడి పిల్లలకు సైతం సన్నబియ్యం అందిస్తున్నామని, ఇదంతా కేసీఆర్‌ వల్లనే సాధ్యమైందన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు ఇప్పుడిస్తున్న దానికంటే రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఖైరతాబాద్‌లో దానం నాగేంద్రను గెలిపించాలని, తొలి ప్రయత్నంలోనే ఇక్కడ ప్రభుత్వ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని మక్తా వాసులకు అభయమిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ కూటమిని గెలిపిస్తే 40 మంది సీఎం అభ్యర్థులుంటారని, వారికి నెలకో ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌లో గాంధీ భవన్‌కు వస్తారన్నారు. సమర్ద వంతమైన ప్రభుత్వం రావాలంటే కేసీఆర్‌ను గెలుపించాలన్నారు. ఈ రోడ్‌ షోలో ఖైరతాబాద్‌ అభ్యర్థి దానం నాగేందర్, సనత్‌గర్‌ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్, కార్పొరేటర్‌ అత్తలూరి విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ మహేష్‌ యాదవ్, పార్టీ డివిజన్‌ నేతలు అహ్మద్, శ్రీనివాస్‌ యాదవ్, సలావుద్దీన్‌ తదిరులు పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణపై దృష్టి
హిమాయత్‌నగర్‌: నగరంలో ప్రధానంగా  పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, మెట్రో సర్వీసుల పొడిగింపు, కాలుష్యం నియంత్రణ ఈ మూడు ప్రధాన సమస్యలని, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హిమాయత్‌నగర్‌ వై–జంక్షన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగిస్తూ నగరంలో 90 శాతం మంచి నీటి సమస్యను పరిష్కరించామని, ఖైరతాబాద్‌ నియోజకవర్గం నగరం నడిబొడ్డున ఉండడం వల్ల స్థలం దొరక్క కొంత సమస్య ఏర్పడిందని, నియోజకవర్గానికి దానం నాగేందర్‌ ఎమ్మెల్యే అయితే జాగా ఎక్కడున్నా డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రస్తుతం నగరంలో తిరుగతున్న 38 వేల ఆర్టీసీ బస్సులను తీసివేసి వీటి స్థానంలో ఎలక్ట్రికల్‌ బస్సులను తీసుకురానున్నట్లు ప్రకటించారు. కాలుష్యం వెలువడుతున్న ఫ్యాక్టరీలను గుర్తించి వాటన్నింటిని నగర శివారు ప్రాంతాలకు తరలిస్తామన్నారు. ఈ పనులలు చేయాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ని, ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement