కోల్‌కత్తా: అధికార దాహంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాజకీయ సంక్షోభమేనని అన్నారు. బెంగాల్‌లో కూడా టీఎంసీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ.. బలవంతగా పార్టీలో చేర్చుకుంటున్నారని దీదీ ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న బెంగాల్‌లో మత సంఘర్షణ సృష్టించాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలను ఈవీఎంలతో ఛీటింగ్ చేసి బీజేపీ గెలిచిందని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన ఎన్నుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమత విమర్శించారు. కాగా ఆదివారం బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో టీఎంసీ భారీ మెగా ర్యాలీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాగా ప్రతి ఏడాది జాలై 21న కోల్‌కత్తాలో టీఎంసీ మెగా ర్యాలీని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment